నీటి కోసం పాట్లు… సీఎం ప్ర‌య‌త్నం ఫ‌లించేనా?!

నీటి కోసం.. తెలంగాణ రైతుల జ‌ల‌ స‌మ‌స్య కోసం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రాల చుట్టూ తిరుగుతూ.. త‌మ రాష్ట్ర స‌మ‌స్య‌లు వివ‌రిస్తున్నారు. ముఖ్య‌మంత్రుల‌ను క‌లుస్తున్నారు. వివిధ ప్రాజెక్టుల‌కు నీటిని నిల్వ చేసుకునే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇదేస‌మ‌యంలో తుమ్మిడి హ‌ట్టి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని కూడా విన్న‌విస్తున్నారు. మ‌రి ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయ‌న్నదే ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం రేవంత్‌రెడ్డి వ‌రుస‌గా వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌డం రాజ‌కీయంగా కూడా చ‌ర్చ‌కు దారితీసింది.

ఇటీవ‌ల‌ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన రేవంత్ రెడ్డి, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ సాగర్, డిండి ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న అనుమతులను వేగవంతం చేయాలని కోరారు. 70 నుంచి 90 శాతం వ‌ర‌కు పూర్తయిన ప్రాజెక్టుల కోసం 5 వేల కోట్ల రూపాయ‌ల ప్రత్యేక ఆర్థిక సాయం, అలాగే కేంద్ర ప‌థ‌కం కింద‌ సమ్మక్క సాగర్-సీతారామ ప్రాజెక్టుకు మ‌రో ఐదు వేల కోట్ల రూపాయ‌లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ప్ర‌ధాని నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి హామీ ల‌భించ‌లేద‌ని స‌మాచారం. కేంద్రం సాయంపై రేవంత్ కూడా మౌనంగానే ఉన్నారు.

ఇక‌, ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తుతో చేప‌ట్టిన‌ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించారు. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే.. ఆదిలాబాద్ స‌హా.. ప‌లు జిల్లాల‌కు నీరు అందుతుంద‌ని.. ప్రాజెక్టు ఎత్తును పెంచుకునేందుకు అడ్డు ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు. అంతేకాదు.. దీనివ‌ల్ల నిర్వాసితుల‌య్యే మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సాయం త‌క్ష‌ణ‌మే అందిస్తామ‌ని కూడా హామీ ఇచ్చారు. భూసేకరణ పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి మ‌హా సీఎం ఓకే చెప్పార‌ని అన్నారు. కానీ.. ఆ త‌ర్వాత మ‌హా రాష్ట్ర స‌ర్కారు నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, తాజాగా మంగ‌ళ‌వారం ఛ‌త్తీస‌గ‌ఢ్‌లో సీఎం రేవంత్ బృందం ప‌ర్య‌టించింది. గోదావరిపై నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్ వోసీ పొందేందుకు అడ్డు ప‌డ‌వ‌ద్ద‌ని ఏకంగా సీఎం విష్ణుదేవ్ శ‌ర్మ‌కు రేవంత్ విజ్ఞ‌ప్తి చేశారు. దీనికి ఆయ‌న ఆమోదించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నా.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు.

ఇదిలావుంటే.. రేవంత్ కోరిక‌లు నెర‌వేరుతాయా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. రేవంత్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నారు. మ‌హారాష్ట్ర‌, ఛత్తీస్‌గ‌ఢ్‌ల‌లో బీజేపీ ప్ర‌భుత్వాలు ఉన్నాయి. ఇక‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా రేవంత్ పై ఎలాంటి వైఖ‌రితో ఉన్నారో అంద‌రికీ తెలిసిందే. దీంతో రేవంత్ డిమాండ్‌.. ఆయ‌న నీటి పాట్లు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌. మ‌రోవైపు రేవంత్ రెడ్డి చెబుతున్న ఎల్‌నినో క‌ష్టాలు ఆయా రాష్ట్రాలు స‌హా దేశ‌వ్యాప్తంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.