‘వాళ్లంతా మూర్ఖులు.. వారికి సైన్స్ తెలీదు’

కేర‌ళ రాష్ట్రానికి చెందిన న‌టుడు, ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి త‌న నోటికి ప‌ని చెప్పారు. బీజేపీ త‌ర‌ఫున తొలిసారి 2024లో ఎంపీగా విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న‌కు మోడీ స‌ర్కారు కేంద్ర మంత్రిగా అవ‌కాశం ఇచ్చింది. అయితే.. ఆయ‌న త‌ర‌చుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ మీడియాలో నిలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ స‌హా.. మేధావి వ‌ర్గాన్ని ఆయ‌న `మూర్ఖులు` అని వ్యాఖ్యానించారు. “వారంతా మూర్ఖులు.. సైన్స్ తెలీదు. ప‌దోత‌ర‌గ‌తి త‌ప్పి ఉంటారు.“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. “విమర్శ‌లు చేసే వారిని తిరిగి స్కూళ్ల‌లో చేర్పించాలి“ అని వ్యాఖ్యానించారు.

విష‌యం ఏంటి?

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్ వినియోగం ద్వారా వ‌చ్చే క‌ర్బ‌న కాలుష్యాన్ని త‌గ్గించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో నే పెట్రోల్‌లో ఇథ‌నాల్‌ను మిక్స్ చేస్తున్నారు. ఈ-20(ఇథ‌నాల్ 20 శాతం క‌లిపిన పెట్రోల్‌)ని కేంద్రం అధికారికంగానే అమ‌లు చేస్తోంది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇథ‌నాల్ వినియోగంతో ప‌ర్యావ‌ర‌ణం ఎంత వ‌ర‌కు మెరుగైందో తెలియ‌దు కానీ.. దీనివ‌ల్ల వాహ‌నాలు దెబ్బ‌తింటున్నాయ‌ని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌, కేర‌ళ‌కు చెందిన మేదావులు కూడా ఇథ‌నాల్ పెట్రోల్‌తో వాహ‌నాలు త్వ‌ర‌గానే షెడ్ల‌ల‌కు వెళ్లిపోతాయ‌ని పేర్కొన్నారు.

అదేస‌మ‌యంలో పెట్రోల్ కంపెనీల‌పైనా రాహుల్ స‌హా మేధావులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కేంద్రం చెప్పిన‌ట్టు 20 శాతం కాకుండా ఇథ‌నాల్‌ను 30-35 శాతం వ‌ర‌కు కూడా క‌లుపుతున్నార‌ని.. దీంతో వాహ‌నాల‌కు ఇబ్బందేన‌ని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా స్పందించిన కేంద్ర మంత్రి సురేష్ గోపీ.. “వాస్త‌వాలు తెలుసుకోకుండా.. కొంద‌రు మూర్ఖులు మాట్లాడుతున్నారు. వారికి సైన్స్ అంటే ఏంటో తెలీదు. కంపెనీలు ఏం చేస్తున్నాయో కూడా చూడ‌రు. వారిని తీసుకువెళ్లి స్కూళ్లలో వేయాలి.“ అని ప‌రుషంగా వ్యాఖ్యానించారు. నిర్దేశిత ప్ర‌మాణాల మేర‌కే ఇథ‌నాల్ క‌లుపుతున్నామ‌న్నారు. అంతేకాదు.. దీనిని అధికారికంగా కేంద్ర‌మే ఆమోదించింద‌న్నారు.

గ‌తంలోనూ ఇలానే..

కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సురేష్ గోపి.. గ‌తంలోనూ ఇలానే నోరు చేసుకున్నారు. గిరిజన వ్యవహారాల పోర్ట్‌ఫోలియోను బ్రాహ్మణుడు లేదా నాయుడు వంటి అగ్రవర్ణాల నాయకులు నిర్వహించాలన్నారు. ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో దుమారం రేపాయి. వాస్త‌వానికి గిరిజ‌నుల‌కు సంబంధించిన అన్ని విష‌యాలను ఆ వ‌ర్గానికి చెందిన వారికే కేటాయించాల‌ని రాజ్యాంగం ప్ర‌తిపాదించింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

మ‌రో స‌మ‌యంలో మాట్లాడుతూ.. తనకు మంత్రిగా తగిన ఆదాయం రావట్లేదని, మళ్లీ సినిమాల్లోనే నటిస్తానని సురేష్ గోపి చెప్పారు. కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.