చూసిందే న‌మ్మండి: భువ‌నేశ్వ‌రి వీడియో ఎందుకంటే!

“చూసిందే న‌మ్మండి”- అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి గ‌త రాత్రి సోష‌ల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. దీనిలో ఆమె.. తాను.. వైస్ చైర్స‌న్‌, ఎండీగా ఉన్న ‘హెరిటేజ్‌’ సంస్థ‌కు సంబంధించిన అంశాల‌ను ప్ర‌స్తావించారు. “చూసిందే నమ్మండి. గ‌త 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.” అని భువ‌నేశ్వ‌రి వివ‌రించారు.

అంతేకాదు.. హెరిటేజ్ సంస్థ నుంచి ఉత్ప‌త్తి అయ్యే ప్ర‌తి దానినీ 25 నాణ్యతా పరీక్షలు చేస్తామ‌ని, ఆ తర్వాతే వినియోగదారుల ఇంటికి చేరుతుందని భువ‌నేశ్వ‌రి పేర్కొన్నారు. 500 మందికి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 9 రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది పాడి రైతులతో పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నామ‌న్నారు. ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించి అర్థం చేసుకోవాల‌ని కూడా భువ‌నేశ్వ‌రి సూచించారు.

ఎందుకు?

అయితే… నారా భువ‌నేశ్వ‌రి మూడు ద‌శాబ్దాలుగా హెరిటేజ్‌ను ముందుకు న‌డిపిస్తూ.. స‌క్సెస్‌ఫుట్ వ్యాపార వేత్త‌గా ఉన్నా.. ఎప్పుడూ.. ఇలా సెల్ఫీ వీడియోల‌తో ప్ర‌జ‌ల ముందుకు రాలేదు. ఇదే తొలిసారి. మ‌రి ఇలా ఎందుకు జ‌రిగింది? అనేది ప్ర‌శ్న‌. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత మీడియాలో గ‌త వారం ప‌ది రోజులుగా.. హెరిటేజ్ సంస్థ‌పై ప‌లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగం జ‌రిగింద‌న్న రిపోర్టు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది పెద్ద రాజకీయ దుమారానికి దారి తీసింది.

ఈ క్ర‌మంలోనే ఇందాపూర్ పూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ పాలు సేక‌రిస్తోంద‌ని.. దీనిలోనూ కెరోటిన్ అనే ర‌సాయనం ఉంద‌ని జ‌గ‌న్ మీడియా స‌హా .. వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. అటు శాస‌న మండ‌లిలోనూ దీనిపైనే చ‌ర్చ సాగుతోంది. ఇది కూడా వివాదాల మ‌ధ్య సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే త‌మ సంస్థ ఉత్ప‌త్తుల‌పై వైసీపీ నేత‌లు చేస్తున్న విష ప్ర‌చారాన్ని అడ్డుకునేందుకు నారా భువ‌నేశ్వ‌రి.. ఇలా సెల్పీ వీడియోను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.