సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత మరో రెండు కేసుల్లో ఆయనను పీటీ వారెంట్ పై పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా…ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా కేసులో తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది.
అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రాంబాబు బయటకు వచ్చేలోపు ఆయనపై మరో పాత కేసులో పీటీ వారెంట్ తీసుకుంటారా ? లేక బెయిల్ పై అంబటిని విడుదల చేస్తారా అన్న విషయంపై చర్చ జరుగుతోంది.
ఎందుకంటే చివరగా అంబటికి బెయిల్ వచ్చిన సమయంలో వెంటనే సంక్రాంతి సంబరాల కేసులో ఆయనను పీటీ వారెంట్ పై అరెస్టు చేశారు. అంబటికి బయటకు వస్తారు అనుకున్న తరుణంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో, ఈ సారైనా అంబటి బెయిల్ పై బయటకు వస్తారా లేక మరేదైనా పాత కేసులో మళ్లీ జైలుకు వెళతారా అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు, తాజాగా తన ఎక్స్ ఖాతాలో అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఎన్ని కేసులు పెట్టినా,ఎన్ని రోజులు జైల్లో ఉన్నా అడుగు వెనక్కి వేసే ప్రశ్నే లేదని అంటటి అన్నారు. జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు ఈ పోరాటం ఆగదని అంబటి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కూడా తగ్గేదేలే అంటూ పోలీసు వ్యాన్ లో కూర్చొని పుష్ప మాదిరి అంబటి చేతులు దువ్విన వైనం వైరల్ అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates