ఏపీ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌.. బ‌డ్జెట్‌కు పూజ‌లు!

ఏపీ చ‌రిత్ర‌లో.. ఆ మాట‌కు వ‌స్తే.. దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి బ‌డ్జెట్ కు పూజ‌లు చేయ‌డం.. దేవుడి చెంత‌న ఉంచ‌డం.. వంటివి ఆస‌క్తిగా మారాయి. ఏపీలో 2026-27 వార్షిక బ‌డ్జెట్‌ను శ‌నివారం(ఫిబ్ర‌వ‌రి-14) అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అయితే.. సంప్ర‌దాయం ప్ర‌కారం.. తొలుత బ‌డ్జెట్ ప‌త్రాల‌ను(బుక్‌లెట్ అయినా.. డిజిట‌ల్ అయినా) స‌భా నాయ‌కుడు అయిన‌.. ముఖ్య‌మంత్రికి.. ఆర్థిక మంత్రి అందిస్తారు. ఆయ‌న ఆ బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను తీసుకుని తిరిగి.. ఆర్థిక మంత్రికి అందిస్తారు.

అనంత‌రం.. స్వ‌ల్ప కాలిక‌ కేబినెట్ స‌మావేశాన్ని నిర్వ‌హించి.. స‌ద‌రు బ‌డ్జెట్‌కు కేబినెట్ ఆమోదం కోర‌తారు. దీనికి సీఎం లేదా కేంద్ర బ‌డ్జెట్ అయితే.. ప్ర‌ధాని స‌హా మంత్రులు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలుపుతారు. ఇది జ‌రిగిన కొద్ది సేప‌టికి.. ఆర్థిక మంత్రి అసెంబ్లీకి చేరుకుని.. స్పీక‌ర్ అనుమ‌తితో బ‌డ్జెట్‌ను చ‌ద‌వ‌డం ప్రారంభిస్తారు. ఇది.. కొన్ని ద‌శాబ్దాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయం. దీనిపై అనుకూల‌తలు, ప్ర‌తికూల‌త‌ల పై మ‌రుసటి రోజు నుంచి చ‌ర్చిస్తారు. కీల‌క అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తారు.

అయితే.. ఈ సంప్ర‌దాయానికి భిన్నంగా తొలిసారి ఏపీలో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌డానికి గంట ముందు.. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో బ‌డ్జెట్ ప‌త్రాల‌ను తీసుకుని ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి.. ఆ శాఖ ఉన్న‌తాధికారులు.. విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధికి చేరుకున్నారు. అనంత‌రం.. ఆయా బ‌డ్జెట్ ప‌త్రాల‌ను అమ్మ‌వారి పాదాల చెంత ఉంచి.. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్, ఆ శాఖ ఉన్న‌తాధికారి డి. రోనాల్డ్ రోస్ మ‌రో న‌లుగురు ఉన్న‌తాధికారులు అమ్మవారి సన్నిధికి చేరుకుని బడ్జెట్ ప్రతులను పురోహితుల‌కు అందించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ ప్ర‌తుల‌ను తిరిగి అమ‌రావ‌తికి తీసుకువ‌చ్చి.. ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌కు అందించారు. ఆయ‌న ఈ ప్ర‌తుల‌ను తీసుకువెళ్లి సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు అందించారు.

త‌ర్వాత‌.. కేబినెట్ స‌మావేశంలో ఈ ప్ర‌తుల‌ను ఆమోదించారు. గ‌తంలో అనేక సార్లు బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టినా.. చంద్ర‌బాబు ఎప్పుడూ ఇలా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు కూడా ఇలా పూజ‌లు చేసిన దాఖ‌లాలు లేవు. ఈ ప‌రిణామంపై కూట‌మి నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మానవ శ‌క్తికి దైవ శ‌క్తికూడా తోడైతే విజ‌యాలు మ‌రింత అద్భుతంగా ఉంటాయ‌ని ప‌లువురు మంత్రులు తెలిపారు.