ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపిన సీబీఐ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. గ‌తంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవోలుగా ప‌నిచేసిన అనిల్‌కుమార్ సింఘాల్‌, ధ‌ర్మారెడ్డి స‌హా ప‌లువురు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేసింది. మ‌రోవైపు.. ఈ న‌కిలీ నెయ్యి ఉదంతంపై నెల్లూరు కోర్టులో చార్జిషీట్ దాఖ‌లు చేసింది. దీనిపై ఒక‌వైపు రాజ‌కీయ ర‌చ్చ కొన‌సాగుతోంది.

ఇదిలావుంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి సీబీఐ సిట్ అదికారులు ప్ర‌త్యేకంగా సిఫార‌సు చేస్తూ.. స‌ద‌రు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీనిపై గ‌త రెండు రోజుల్లోనే ప్ర‌భుత్వం ఆలోచ‌న‌లో ప‌డింది. అయితే.. న‌కిలీ నెయ్యి వ్య‌వ‌హారం ముదురుతున్న నేప‌థ్యానికి తోడు కోర్టులో కేసు విచార‌ణ కూడా రానున్న నేప‌థ్యంలో సీబీఐ సిఫార‌సు చేసిన అధికారుల‌పై చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించింది. వీరిలో మాజీ ఈవో ధ‌ర్మారెడ్డి ఇప్ప‌టికే రిటైర్ అయ్యారు. దీంతో ఆయ‌న‌కు ప్ర‌భుత్వం తాఖీదులు ఇవ్వ‌నుంది.

ఈ లోగా.. ప్ర‌స్తుతం టీటీడీ ఈవోగా ప‌నిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్‌ను త‌క్ష‌ణం బ‌దిలీ చేసింది. అయితే.. ఆయ‌న‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌లో రిపోర్టు చేయాల‌ని ఆదేశాల్లో పేర్కొంది. అదేసమ‌యంలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌ను టీటీడీ ఈవోగా నియ‌మిస్తూ.. ప్ర‌బుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్‌.. ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వులు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపారు.

కాగా.. అనిల్ కుమార్ సింఘాల్‌.. గ‌తంలో వైసీపీ హ‌యాంలోనే టీటీడీ ఈవోగా ప‌నిచేశారు. అనంత‌రం.. చంద్ర‌బాబు సీఎం అయ్యాక‌.. మ‌రోసారి ఆయ‌న‌కు ఇటీవ‌లే.. బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే.. సీబీఐ సిట్ అధికారులు ఇచ్చిన సిఫార‌సుల మేర‌కు.. ఆయ‌న‌ను బ‌దిలీ చేసి.. వీఆర్‌లో పెట్ట‌డం గ‌మ‌నార్హం. 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సింఘాల్‌ను ఇటీవ‌ల సిట్ అధికారులు విచారించారు. న‌కిలీ నెయ్యి వ్య‌వ‌హారంలో త‌న పాత్ర లేద‌ని.. అప్ప‌టి టీటీడీబోర్డు నిర్ణ‌యాన్ని మాత్ర‌మే తాము అమ‌లు చేశామ‌ని చెప్పారు. అనంతరం సిబీఐ.. సీరియ‌స్ సిఫార్సు చేయ‌డం గ‌మ‌నార్హం.