తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపరిచిన అభ్యర్థులు కొన్నిచోట్ల విజయం సాధించారు.

వారితో కొండగట్టు పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై దశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కమిటీలు అన్నీ రద్దు చేసి నూతనంగా అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీ ప్రకటించింది.

ఏపీలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాయి. ఇదే పొత్తు తెలంగాణలో కొనసాగుతుందా లేదా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, అందువల్ల జనసేనతో పొత్తు అవసరం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పార్టీ స్వతంత్రంగానే ముందుకు వెళ్లగల సామర్థ్యం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తుల అంశంపై తుది నిర్ణయం తీసుకునేది కేంద్ర నాయకత్వమేనని రాంచందర్‌రావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదని, పార్టీ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ స్థానం మరింత బలపడుతోందని, రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో మరింత ప్రభావవంతంగా పోటీ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన స్పందించింది. పొత్తుల అంశంపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే అధికారం పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కే ఉంటుందని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌ స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అన్నది పవన్‌ నిర్ణయమని, ఈ విషయంలో స్థానిక స్థాయిలో ఊహాగానాలకు తావులేదన్నారు.

పొత్తు ఉన్నా లేకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని శంకర్‌గౌడ్‌ తెలిపారు. పార్టీకి బలమున్న స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ విస్తరణకు, ప్రజల్లో బలమైన హాజరుకు వేదికగా మలుచుకుంటామని పేర్కొన్నారు.

అలాగే జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీని క్రమంగా బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిలకడగా పోరాటం చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేనను ప్రభావవంతమైన రాజకీయ శక్తిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని శంకర్‌గౌడ్‌ పేర్కొన్నారు.