రాజకీయాల్లో మాట తీరు ఎంతో ముఖ్యం. ఒక్క మాట నోరు జారడంతో మంత్రి పదవులు కోల్పోయినవారు ఉన్నారు. అందుకే ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రజలతో అయినా, కార్యకర్తలతో అయినా మాట్లాడేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే ఎంతటి వారైనా చిక్కుల్లో పడక తప్పదు. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మంత్రి టీజీ భరత్ తాజాగా ఆ తరహా చిక్కుల్లో పడ్డట్లు కనిపిస్తున్నారు.
నేను స్కెచ్ వేస్తే ఎవరూ తట్టుకోలేరు. నా స్ట్రాటజీ గురించి మీకు తెలియదు అంటూ కర్నూలు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలకు భరత్ ఇచ్చిన వార్నింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అంతేకాదు, ఎమ్మెల్యేలు రాజకీయాలు చేసి తనను గెలకవద్దని కూడా ఆయన హెచ్చరించారు. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ తాను వేలు పెట్టలేదని అన్నారు. తనకు పదవి వచ్చిన తర్వాత తాను పెద్దగా రాజకీయాలు చేయలేదని, ఈ విషయం తెలుసుకోవాలని పేర్కొన్నారు.
ఇక, ఈ ఐదేళ్లే కాదు, టీడీపీ ఉన్నంతవరకూ తానే మంత్రిని అని భరత్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తన గురించి చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు తెలుసని, ఎవరెంత చెప్పినా వారి మనసులో తనపై ఉన్న అభిప్రాయం మారదని ఆయన చెప్పుకొచ్చారు.
భరత్ వ్యాఖ్యలను బట్టి ఆయనపై కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు నాయుడు, లోకేశ్ దగ్గర భరత్ గురించి మాట్లాడడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. వారిని దృష్టిలో పెట్టుకునే భరత్ ఈ తరహా మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, వార్నింగ్ ఇచ్చే క్రమంలో టీడీపీ ఉన్నంత వరకు నేనే మంత్రి అని చెప్పడం ఆయనను కొంత ఇరకాటంలో పడేసినట్లు కనిపిస్తోంది. సీనియర్ నేతలు సహా ఇతర నేతలు ఈ వ్యాఖ్యలపై కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates