క‌ర‌ణం కొంచెం త‌గ్గాలి.. క‌మ్మ నేత‌ల సూచ‌న ఇదే!

ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ మూర్తికి సంబంధించి స్థానికంగా కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిని ఆయ‌న సానుభూతి ప‌రులే వైర‌ల్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వీటి సారాంశం మొత్తం ఒక్క‌టే. రాజ‌కీయంగా ఆయ‌న‌కు కొంత సానుకూల వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డ‌మే. ఈ క్ర‌మంలో క‌ర‌ణం సామాజిక వ‌ర్గం అన్యాప‌దేశంగా ఆయ‌న‌కు కొన్ని స‌ల‌హాలు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా క‌ర‌ణంను.. క‌మ్మ సామాజిక వ‌ర్గం నెత్తిన పెట్టుకుంది. ఆయ‌న‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటోంది. నిజానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చీరాల నుంచి పోటీ చేసిన‌ప్పుడు ఇక్క‌డ క‌మ్మ వ‌ర్గ‌మే ఆయ‌న‌ను గెలుపు గుర్రం ఎక్కించింది.

ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌తో క‌మ్మ వ‌ర్గం.. క‌ర‌ణానికి అనుకూలంగా మారిపోయింది. అయితే.. ఇప్పుడు అదే క‌ర‌ణం.. వ్య‌వ‌హ‌రిస్తున్న రాజ‌కీయ పంథాతో.. ఈ వ‌ర్గం ఇబ్బంది ప‌డుతోంది. దీంతో క‌ర‌ణం త‌గ్గాలంటూ.. కొన్ని సూచ‌న‌లు చేస్తున్నారు. చీరాల‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గం త‌క్కువ‌. అయినప్ప‌టికీ.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అన్ని వ‌ర్గాల‌ను స‌మీక‌రించి క‌ర‌ణం గెలుపున‌కు ప్ర‌య‌త్నాలు చేశారు. ఇప్పుడు క‌ర‌ణం దూకుడు రాజ‌కీయాల‌తో ఆయ‌న‌కు సానుకూలంగా క‌మ్మ వ‌ర్గం చ‌క్రం తిప్పే ప‌రిస్థితి లేకుండా పోయింది. మ‌రీ ముఖ్యంగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్ర‌ధానంగా క‌ర‌ణం రాజ‌కీయానికి మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంది.

నిజానికి టీడీపీలో ఉన్న‌ప్పుడు బ‌ల‌రాంను బ‌ల‌ప‌రిచిన క‌మ్మ వ‌ర్గం.. ఇప్పుడు ఆయ‌న వైసీపీలోకి వెళ్లాక కూడా అండ‌గానే ఉంది. కానీ, రాజ‌కీయంగా ఆయ‌న త‌ను ఏమీ చేసుకోలేక‌.. త‌న వారికి ఏమీ చేయ‌లేక‌పోవ‌డంతో ఈ వ‌ర్గంలోనూ అసంతృప్తి నెల‌కొంది. క‌య్యానికి కాలు దువ్వి.. సాధించేదేంటి? అనేది ఈ వ‌ర్గం ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రీముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుమారుడు వెంక‌టేష్‌ను వైసీపీ త‌ర‌ఫున రంగంలోకి దింపాల‌ని అనుకుంటున్నారు బ‌ల‌రాం. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో పెద్ద ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. చీరాల నుంచి ఆమంచి ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌ప్పుకొనే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో అద్దంకి నుంచి వెంక‌టేష్‌ను నిల‌బెట్టాలి.

అయితే.. ఇక్క‌డ కూడా ప‌రిస్థితి అనుకూలంచేలా క‌నిపించ‌డం లేదు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌విని వైసీపీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు అధికార పార్టీ నేత‌లు. ఆర్థికంగా ఎదుర‌వుతున్న చిక్కుల‌తో ఆయ‌న కూడా అటే మొగ్గితే.. ఇక‌, ఇక్క‌డ క‌ర‌ణం వెంక‌టేష్‌కు టికెట్ ద‌క్కే ప‌రిస్థితి లేదు. అంటే.. ఇటు చీరాల‌, అటు అద్దంకి రెండిట్లోనూ క‌ర‌ణంకు అవ‌కాశాలు కొలాప్స్ అవుతున్నాయి. మిగిలేది ప‌రుచూరు. కానీ, అక్క‌డ టీడీపీ బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఎటు చూసినా.. క‌ర‌ణం చిక్కుల్లో ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో క‌య్యానికి కాలు దువ్వ‌డం ఎందుక‌ని క‌మ్మ సామాజిక వ‌ర్గ‌మే ప్ర‌శ్నిస్తోంది.