మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక పత్రాలు అందుకుంటున్న ఓ మహిళా ఆయుష్ డాక్టర్ హిజాబ్‌ను సీఎం స్వయంగా తొలగించిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఆ మహిళ క్షణకాలం నిశ్చేష్టురాలై నిల్చున్నట్లు కనిపించింది. వేదికపై ఉన్న కొందరు నవ్వడం కూడా విమర్శలకు కారణమైంది.

ఈ ఘటనపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆర్జేడీ నితీశ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదేమో అంటూ విమర్శలు గుప్పించగా, కాంగ్రెస్ ఈ చర్యను అసహ్యకరమైనదిగా పేర్కొని సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

రాష్ట్రంలో మహిళల భద్రతపై ఈ ఘటన తీవ్ర సందేహాలు కలిగిస్తోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,283 మంది ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేశారు. వీరిలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్యులు ఉన్నారు. వీరిని ఆయుష్ మెడికల్ సర్వీసులు, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో వివిధ ఆరోగ్య సంస్థల్లో నియమించనున్నారు. ఈ ఘటన బిహార్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.