వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన ఈ విషయంపై దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు.. ఆయనను ఎవరు ఆహ్వానిస్తారు అనే విషయాలు ప్రస్తుతం ఆసక్తిగా మారుతున్నాయి. ఎవరిని చూసినా.. ఏ పార్టీని గమనించిన విజయ సాయి రెడ్డి ని చేర్చుకునే దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది, ఆయన జనసేన వైపు చూస్తున్నారా అన్న సందేహాలను కూడా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో బిజెపి దిశగా కూడా ఆయన అడుగులు వేసే అవకాశం ఉందన్న వాదన కూడా తెర మీదకు రావడం గమనార్హం. మతమార్పిడులను సహించేది లేదని, మతమార్పిడి చేసే వారిని కఠినంగా శిక్షించాలని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
నిజానికి వైసీపీలో ఉన్నప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు ఎప్పుడు ఆయన చేయలేదు. అంతే కాదు కులమతాల గురించి కూడా పెద్దగా ఆయన స్పందించిన పరిస్థితి లేదు. అంతెందుకు తిరుమల శ్రీవారి లడ్డు విషయం వివాదానికి గురి అయినప్పుడు, కల్తీ జరిగిందన్న విమర్శలు వచ్చినప్పుడు కూడా సాయి రెడ్డి స్పందించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని అదేవిధంగా మతమార్పిడిలను అరికట్టాలని చెబుతుండడం వంటివి గమనిస్తే ఆయన రాజకీయంగా అటు బిజెపి లేదా ఇటు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది అన్నది స్పష్టం అవుతుంది.
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని ఇప్పటివరకు ఆయన పై ఎలాంటి విమర్శ తాను చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఆయనను దగ్గర చేసే అవకాశం ఉంటుందా అనేది చర్చ. ఎందుకంటే జనసేన కూడా గత రెండు సంవత్సరాలుగా హిందూ ధర్మం వైపు సనాతన ధర్మం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడ హిందూ ధార్మిక కార్యక్రమాలు జరిగినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేన ను ఆకర్షించే లాగా ఉన్నాయి అన్నది ఒక వాదన. అయితే దీనికి మరో వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీని పరోక్షంగా ఆయన విమర్శించారని తద్వారా బిజెపికి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. అయితే బీజేపీ గురించి ప్రత్యేకంగా సాయి రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు వినిపించాల్సిన అవసరం లేదు. పైగా కేంద్రంలోని పెద్దలతో ఆయనకు సత్సంబంధాలు ఎలానో కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన హిందూ ధర్మాన్ని ప్రశంసిస్తూ మతమార్పిడులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మొత్తానికి సాయి రెడ్డి మనసులో జనసేన వైపు రావాలన్న వాదన బలంగా ఉందన్నది స్పష్టం అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుంది.. ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు.. ఏ పార్టీ సాయి రెడ్డికి ఆహ్వానం పలుకుతుంది.. ఇవన్నీ ఇప్పటికి ప్రశ్నలే. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates