ఏపీలో వరుస పెట్టుబడులు.. అదే లైన్‌లో ఒప్పందాల జోరు పుంజుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో నూతన సందడి నెలకొంది. గురువారం కీలక కంపెనీ రెన్యూ ఎనర్జీ సంస్థ 82 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖలో ఈ ఒప్పందం కుదిరింది. ఇక, ఈ నెలలోనే గూగుల్ సంస్థ కూడా ఒప్పందం కుదుర్చుకుంటోందని మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
అంతేకాదు.. విశాఖలోని ఎండాడ ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు గురువారం నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఇది మరో ప్రాజెక్టు అని తెలిపారు. దీనివల్ల తక్షణమే 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధులు లభించనున్నాయని వివరించారు. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ద్వారా విశాఖకు 3800 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నట్టు నారా లోకేష్ వెల్లడించారు. అనకాపల్లిలో త్వరలోనే ఆర్సెల్ లార్ మిట్టల్ కంపెనీ రానుందని తెలిపారు. ఇన్పోసిస్ సంస్థ కూడా త్వరలోనే కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు చెప్పారు.
ఇక, కొందరు చేస్తున్న విమర్శలకు నారా లోకేష్ తనదైన శైలిలో జవాబు చెప్పారు. అభివృద్ధిని ఒక ప్రాంతానికే పరిమితం చేస్తున్నామన్న వాదన సరికాదన్నారు. అందరూ ఆలోచన చేయాలన్నారు. నెల్లూరు ఏసీలు తయారు చేసే ప్రాజెక్టును తీసుకువచ్చామన్నారు. కడపలో సిమెంటు ఫ్యాక్టరీ రానుందన్న ఆయన ప్రకాశంలోనూ అనేక ప్రాజెక్టులు నెలకొల్పుతున్నట్టు వివరించారు. కియా ద్వారా తిరుపతిలో భారీ ఇమేజ్ పెరిగిందని వివరించారు.
ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని.. వాటిని దశల వారీగా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తున్నట్టు మంత్రి వివరించారు. కొందరు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా నారా లోకేష్ పిలుపునిచ్చారు. కేవలం 17 మాసాల్లోనే 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates