మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలు బహిర్గతం అయ్యాయి. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని పరిశీలించారు. మాజీ అటవీశాఖ మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధం ఉన్నట్లు చెబుతున్న 76.74 ఎకరాల అటవీ భూమి అక్రమ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎక్స్ క్లూజివ్ వీడియోను ఈరోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం ఓ కార్యాలయం విడుదల చేసింది.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిన్న టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ క్రమంలో ఈ వీడియోను విడుదల చేయటం సంచలనం రేకెత్తించింది.
‘మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది, ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకోవాలి. దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయండి..’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా చూపారు. ఒకేసారి ఎందుకు ఇంత పెరిగిందన్నది కూడా పరిశీలించాలన్నారు.
అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ (పి.ఓ.ఆర్.), ఛార్జ్ షీట్ దాఖలు చేశామని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు ప్రొడ్యూస్ చేశామన్నారు. ‘ప్రజలకు సంబంధించిన ఆస్తులు, జాతికి సంబంధించిన ఆస్తులపై కన్నేసే వారిపై నిఘా ఉంచుతాం. ప్రకృతి వనరులను దోపిడీ చేసేవారు, ఆక్రమించుకునే వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటాం’’ అని పవన్ స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates