శ్రీవారి ప‌ర‌కామ‌ణి చోరీపై సీఐడీ: హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

2021-22 మ‌ధ్య తిరుమ‌ల శ్రీవారి కానుకల హుండీ(ప‌ర‌కామ‌ణి) లెక్కింపు స‌మ‌యంలో విదేశీ క‌రెన్సీ దొంగ తనం.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై తాజాగా హైకోర్టు మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ వ్య‌వ‌హారంపై అత్యంత లోతుగా ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. “శ్రీవారిపై అపార న‌మ్మ‌కంతో భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల విష‌యంలో ఇంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌రు. ఇది తీవ్ర ప‌రిణామం“ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని సీఐడీ ద‌ర్యాప్తునకు అప్ప‌గిస్తున్న‌ట్టు తెలిపింది.

అంతేకాదు.. ఆనాటి.. ప‌రాక‌మ‌ణి లెక్కింపు అధికారిగా వ్య‌వ‌హ‌రించిన ర‌వికుమార్‌.. 90 డాల‌ర్ల‌ను లోదుస్తుల్లో పెట్టుకుని తీసుకువెళ్ల‌డం.. అనంత‌రం.. ఈ విష‌యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు(అప్ప‌టి ఈవో క‌రుణాక‌ర్‌రెడ్డి) రాజీ కుదుర్చుకునేందుకు అంగీక‌రించ‌డం పైనా కోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. “ఇదేదో లాలూచీ వ్య‌వ‌హారం“ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. 90 డాల‌ర్లు దోచుకున్న ర‌వికుమార్ అనంతరం శ్రీవారికి 7 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఇస్తూ.. ప‌త్రాలు రాసిచ్చారు.

దీనిని కూడా కోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించింది. అన్ని ఆస్తులు ఆయ‌న‌కు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో ప‌రిశీలించి.. విచారించాల‌ని ఆదేశించింది. దీనిపై ఏసీబీని వేయాల‌ని డీజీపీని ఆదేశించింది. అవి అక్ర‌మాస్తులా?  స‌క్ర‌మాస్తులా? తేల్చాల‌ని స్ప‌ష్టం చేసింది. అదేవిధంగా ర‌వికుమార్ బ్యాంకు ఖాతాల‌ను ప‌రిశీలించ‌డం తోపాటు.. మ‌నీలాండ‌రింగ్ జ‌రిగి ఉంటే.. ఆ కేసును ఈడీకి అప్ప‌గించాల‌ని కూడా ఆదేశించింది. ఈ వ్య‌వ‌హారాల‌పై త‌క్ష‌ణం విచార‌ణ చేప‌ట్టాల‌ని.. త‌దుప‌రి విచార‌ణ‌కు నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశాల్లో పేర్కొంది.

ఆనాటి చిన్న‌దే అని..

గ‌తంలో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారాన్ని ఆనాడు.. టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి చిన్న‌దే నని కొట్టి పారేశారు. అంటే.. శ్రీవారి న‌గ‌దును దొంగ‌తనం చేసిన వ్య‌క్తిని ప‌రోక్షంగా ఆయ‌న వెనుకేసుకు వ‌చ్చార‌ని.. గ‌తంలో కోర్టు వ్యాఖ్యానించింది. అయితే.. ఈ కేసులో నేరుగా భూమ‌న లేక‌పోయినా.. రాజీ కుదర్చ‌డంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారన్న‌ది పిటిష‌నర్ల వాద‌న‌. శ్రీవారి 90 డాల‌ర్లు(నాటి విలువ ప్ర‌కారం 70 వేలు) కొట్టేసి.. ఏకంగా 7 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను శ్రీవారికి రాసివ్వ‌డంపై కూడా గ‌తంలో కోర్టు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ఈ కోణంలోనే ఇప్పుడు.. విచార‌ణ‌కు ఆదేశించింది.