ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే తన నిర్ణయమే కరెక్ట్ అన్న ధోరణితో ఉన్నారు. ఈ విషయం ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా స్పష్టమైంది. నిజానికి కాలం మారుతోంది. ప్రజల ఆలోచనా ధోరణులు కూడా మారుతున్నాయి. ఒకప్పటి మాదిరిగా.. నాయకులు మంకు పట్టు పడితే.. కుదరదు. ఒక సందర్భంలో కాకపోతే.. మరో సందర్భంలో అయినా.. ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి.
కానీ, ఈ దిశగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. నిజానికి విశ్వగురుగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోడీ కూడా.. ఓ సందర్భంలో వెనక్కి తగ్గారు. మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు.. ఆయన ప్రజల ముందుకు వచ్చారు. సదరు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో తాము విఫలమయ్యామని ఒప్పుకొన్నారు. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. ఆ తర్వాత.. ఆయన గ్రాఫ్ కూడా పెరిగింది.
ఈ తరహా పరిస్థితి జగన్‌లో ఎక్కడా లేక పోవడం గమనార్హం. ఇదిలావుంటే.. అమరావతి రాజధానికి పలు ప్రఖ్యాత సంస్థలు వస్తున్నాయి. వీటిలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. తాజాగా రాజధానిలో సచివాలయానికి సమీపంలోని నేలపాడు వద్ద.. 4 ఎకరాల భూమిని ఆర్బీఐ కొనుగోలు చేసింది. మొత్తం 12 కోట్ల రూపాయలకు ఈ భూమిని ప్రభుత్వం విక్రయించింది. దీనిలో ఆర్బీఐ తన ప్రధాన కార్యా లయాన్ని నిర్మించనుంది. నిజానికి ఇతర సంస్థల రాక వేరు.. ఆర్బీఐ వంటి కీలకమైన సంస్థ వచ్చిందంటే.. అన్నీ ఆలోచించుకునే వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
సో.. ఇక, రాజధాని అమరావతిని కదిలించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితిలోనూ ఉండవని ఆర్బీఐ భావించిన తర్వాతే.. ఇంత భారీ మొత్తంలో నిర్మాణాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిందని బ్యాంకింగ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక, ఇప్పటికే ఎస్బీఐ.. సహా ఇతర బ్యాంకులు తమ ప్రాంతీయ కార్యాలయాలను నిర్మించేందుకు రెడీ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అయినా.. జగన్ వెనక్కి తగ్గక తప్పదు. దీనిని ఆయన తప్పుగా కూడా భావించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఉన్న వారంతా.. అన్నీ కరెక్టే చేసేస్తారని అనుకునే పరిస్థితి లేదు. అయితే.. ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని అంతే హుందాగా అంగీకరించి వెనక్కి తీసుకుంటే.. ప్రజలు కూడా అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates