ప్యాన్ ఇండియా సినిమాలకు తెలంగాణా షాక్

తాజాగా విడుదలైన ఓజి సినిమా ప్రీమియర్లు, పెంచిన టికెట్ రేట్ల మీద ఇచ్చిన ఉత్తర్వు చెల్లదంటూ తెలంగాణ హై కోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు ఇవ్వడం, దాని మీద మూవీ యూనిట్ అప్పీల్ కు వెళ్తే, డివిజన్ బెంచ్ దాన్ని శుక్రవారం వరకు నిలుపుదల చేస్తూ నిర్మాతకు ఊరట కలిగించడం ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు. హోమ్ శాఖకు ఇలా వెసులుబాటు ఇచ్చే అధికారం లేదంటూ ఒక వ్యక్తి వేసిన పిల్ ఆధారంగా వ్యవహారం ఇక్కడిదాకా వచ్చింది. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఉదంతం గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాబోయే ప్యాన్ ఇండియా సినిమాలకు టెన్షన్ కలిగించేలా ఉన్నాయి.

పుష్ప 2 ఉదంతం తర్వాత ఇకపై తెలంగాణలో స్పెషల్ షోలు, టికెట్ రేట్ల హైకులు ఉండవని అసెంబ్లీలో ఆన్ రికార్డు తానే అన్నానని, కానీ ఇప్పుడు మూడు నాలుగు రోజులు ఒంట్లో బాగోకపోవడంతో ఆసుపత్రిలో ఉండటం వల్ల ఓజికి సంబంధించిన ప్రొసీడింగ్స్ చూడలేదని అన్నారు. హైకోర్టు స్పందించిన తీరు శుభ పరిణామంగా అనిపిస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు ప్రధాన వినోద సాధనమైన సినిమాని ఇలా ధరల పేరుతో దూరం చేయడానికి తాను వ్యతిరేకం అంటున్న కోమటిరెడ్డి ఇకపై ఎలాంటి సినిమాకైనా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడాలు ఉండవని, రేట్లు పెంచమని ప్రభుత్వం వద్దకు రావద్దని తేల్చి చెప్పేస్తున్నారు. ప్రొడ్యూసర్లకు ఇది శరాఘాతమే.

రాబోయే నెలల్లో ది రాజా సాబ్, అఖండ 2, విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు, స్వయంభు లాంటి చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి గారు అన్నట్టు నిజంగా ఆంక్షలు కఠినంగా పెడితే మాత్రం తెలంగాణలో మల్టీప్లెక్సులు 295, సింగల్ స్క్రీన్లు 175 రూపాయలకు మించి పెట్టడానికి ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో జిఓ ఇచ్చారు కాబట్టి ఇక్కడా అదే అనుసరించినట్టుగా కనిపిస్తోందని చెప్పిన కోమటిరెడ్డి నిజంగా అన్న మాటమీద ఉండి, ఎంత పెద్ద హీరో సినిమాకైనా చిన్న మూవీకైనా ఒకటే రూల్ అంత స్ట్రిక్ట్ గా పెడతారా లేదానేది వేచి చూడాలి. నిజంగా జరిగితే కామన్ ఆడియన్స్ కి పెద్ద శుభవార్తే.