జ‌గ‌న్ రూల్స్ పాటించాలి: ర‌ఘురామ‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ రూల్స్ పాటించాల‌ని శాస‌న స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రూల్స్ ప్ర‌కారం.. అన‌ర్హ‌త వేటు వేసే అధికారం స్పీక‌ర్‌కు, స‌భ‌కు కూడా ఉంటాయ‌ని తెలిపారు. ఈ విష‌యంలో త‌న‌కు తెలియ‌ని విష‌యాలు ఉంటే త‌న లాయ‌ర్‌ల ద్వారా తెలుసుకుని అయినా.. స‌భ‌కు రావ‌డం మంచిద‌న్నారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది ఇంట్లో కూర్చోవ‌డానికి కాద‌న్నారు.

ఒక మాజీ ముఖ్య‌మంత్రిగా, ఐదేళ్ల‌పాటు స‌భా నాయ‌కుడిగా ప‌ని చేసిన జ‌గ‌న్‌కు అసెంబ్లీ రూల్స్ తెలియ‌ని అనుకోవ‌డం లేద‌న్న ర‌ఘురామ‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోసం మొండి ప‌ట్టుద‌ల‌కు పోవ‌డం స‌రికాద‌న్నారు. స‌భ‌కు హాజ‌రై రూల్స్ ప్ర‌కారం న‌డుచుకోవాల‌నిసూచించారు. ఆయ‌న‌కే కాకుండా వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలు అంద‌రికీ కూడా తాము విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్టు వివ‌రించారు. స‌భ న‌డుస్తున్న స‌మయంలోనే స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించేందుకు, వాటికి మంత్రులు స‌మాధానం చెప్పేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రించారు.

ప్ర‌జ‌ల కోసం అయినా.. స‌భ‌కు రావాలి జ‌గ‌న్‌కు సూచించారు. ఇదేస‌మ‌యంలో స‌భ‌కు రానంత మాత్రాన కేవ‌లం జీత‌మేకాద‌ని.. అన‌ర్హ‌త వేటు కూడా పొంచి ఉంటుంద‌న్నారు. వ‌రుస‌గా 60 రోజుల పాటు స‌భ‌కు రాక‌పోతే.. ఖ‌చ్చితంగా వేటు వేసే అధికారం స‌భ‌కు ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌జాప్ర‌తినిధ్య చ‌ట్టంలోనే కాకుండా.. వేత‌నాలు, చెల్లింపుల చ‌ట్టంలోనూ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. ఇప్ప‌టికే స‌భ 45 రోజుల‌కు పైగా పూర్త‌యింద‌ని తెలిపారు. మొత్తం స‌భ‌లో క‌నీసం హాజ‌రు కూడా లేక‌పోతే..వేటు వేసే అధికారం త‌మ‌కు ఉంటుంద‌ని చెప్పారు.

ఈ విష‌యంలో స్పీక‌ర్ కూడా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలిపారు. అన‌ర్హ‌త వేటుపై జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల ను ఎవ‌రూ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కేవ‌లం పార్టీ మారితేనే అన‌ర్హ‌త వేటు ప‌డ‌ద‌ని.. పార్టీ మార‌క‌పోయినా.. స‌భ‌కు రాకుండా డుమ్మా కొట్టినా నిర్ణీత స‌మ‌యం వ‌ర‌కు వేచి చూసి.. అనర్హుడిని చేయొచ్చ‌ని వివ‌రించారు.