కేఏ పాల్‌పై కేసు.. ఏం జ‌రిగింది?

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కిలారి ఆనంద‌పాల్‌(కేఏ పాల్‌)పై హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న‌ను పాల్ లైంగికంగా వేధించారంటూ.. ఓ యువ‌తి ఫిర్యా దు చేయ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేసి, మాన‌సికంగా వేధించార‌ని కూడా ఆమె చెప్పిన‌ట్టు తెలిపారు. అయితే ఫిర్యా దు చేసిన యువ‌తి విదేశాల‌కు చెందిన వ్య‌క్తిగా చెప్పారు.

పాల్‌కు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే అమెరికా కో ఆర్డినేట‌ర్‌గా ఓ యువ‌తి పాల్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో మీడియా స‌మావేశాలు నిర్వ‌హించి న‌ప్పుడు.. త‌నను తాకుతూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు ఆరోపించారు. త‌న భుజంపై చేయి వేసి.. ఇత‌రుల ముందు మాట్లాడుతున్నార‌ని కూడా ఆమె పేర్కొన్నారు. తాను ఇటీవ‌ల కాలంలోనే ఆయ‌న ద‌గ్గర కోఆర్డినేట‌ర్‌గా ప‌నిచేయ‌డం ప్రారంభించిన‌ట్టు తెలిపారు.

పాల్ చేష్ఠ‌ల‌తో మానసికంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు కూడా యువ‌తి తెలిపారు. అదేస‌మ‌యంలో పార్టీలో చేరాల‌ని.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని కూడా ఒత్తిడి తెస్తున్న‌ట్టు ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే.. ఈ వేధింపుల‌పై పాల్ ను విచారించ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. మ‌రోవైపు పాల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసుపై కానీ, ఆ యువ‌తి ఫిర్యాదుపై కానీ స్పందించ‌క‌పోవ‌డం గమ‌నార్హం. ఇదిలావుంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తాన‌ని పాల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఉద్దేశ పూర్వ‌కంగా ఆయ‌న‌పై కేసు పెట్టించార‌న్న వాద‌న ప్ర‌జాశాంతి పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపిస్తుండ‌డం ఆశ్చ‌ర్యక‌రంగా మారింది.