మా పార్టీ.. పుష్ప‌క విమానం: చంద్ర‌బాబు ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీ గిరి గీసుకుని కూర్చోద‌ని అన్నారు. “ఇది ప్ర‌జ‌ల పార్టీ. ప్ర‌జ‌ల కోసం పెట్టిన పార్టీ.. పుట్టిన పార్టీ.. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇది పుష్ప‌క విమానం. ఎంత మంది వ‌చ్చినా.. మ‌రొక‌రికి చోటు ఉంటుంది. రాష్ట్రంలో సుప‌రిపాల‌న‌ను చూసి చాలా మంది చేరుతామ‌ని ముందుకు వ‌స్తున్నారు. అంద‌రికీ ఒక్క‌టే చెబుతున్నా.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకునేవారు ఎవ‌రైనా రావొచ్చు. వ్య‌క్తిగ‌త స్వార్థానికి.. సంపాద‌న‌కు పార్టీలో చోటు ఉండ‌దు. ప్ర‌జ‌ల కోసం ఎంత మంది వ‌చ్చినా.. చోటు ఉంటుంది.“ అని పిలుపునిచ్చారు.

తాజాగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీలో చేరారు. అమ‌రావ‌తి ప‌రిధిలోని ఉండ‌వ‌ల్లిలో ఉన్న ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం సాయంత్రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వైసీపీకి రాజీనామా చేసిన క‌ర్రి ప‌ద్మ‌శ్రీ(తూర్పు గోదావ‌రి), మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌(సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే, చిల‌క‌లూరిపేట‌), బ‌ల్లి క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి(గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున ఎంపీ, ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్న బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ త‌న‌యుడు)లు.. సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. వారిని సీఎం చంద్ర‌బాబు సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. గ‌తానికి బిన్నంగా తాజాగా పార్టీలో చేరేందుకు ముందుకు వ‌చ్చిన వారితో ఆయ‌న 10 నిమిషాల చొప్పున చ‌ర్చించారు.

వారు ఎందుకు పార్టీ మారారు? భ‌విష్య‌త్తులో ఏం కోరుకుంటున్నారు? ప్ర‌జ‌ల‌తో వారికి ఉన్న అనుబంధం? అదేవిధంగా పార్టీకి చేసే కంట్రిబ్యూష‌న్‌? వంటి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం వారి నుంచి ప్ర‌భుత్వ పాల‌న‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో వివ‌రంగా తెలుసుకున్నారు. అనంత‌రం.. వారికి పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. గ‌తంలో పార్టీలోకి ఎవ‌రినీ తీసుకోకూడ‌ద‌ని అనుకున్నామ‌ని..కానీ, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేందుకు ముందుకు వ‌చ్చే వారి విష‌యంలో ఆంక్ష‌లు పెట్ట‌డం స‌రికాద‌ని భావించి నిర్ణ‌యం మార్చుకున్న‌ట్టు తెలిపారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేవారు ఎవ‌రైనా ముందుకు రావ‌చ్చ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. త‌మ పార్టీ పుష్ప‌క విమాన‌మ‌ని వ్యాఖ్యానించారు.