వైసిపి అధినేత జగన్ సొంత జిల్లా కడపలో టిడిపి నాయకులు మరో ప్రచారం ప్రారంభించారు. తన సొంత జిల్లా పై ఎనలేని ప్రేమ ఉందని, తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తారని వైసీపీ నాయకులు జగన్ గురించి పదేపదే ఇక్కడ చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతాలు పలికి సమస్యలు కూడా వినిపిస్తారు. అయితే, అధికారంలో ఉన్నంతవరకు ఎలా ఉన్నా అధికారం కోల్పోయిన తర్వాత కడపకు వస్తున్నప్పటికీ కొంతమంది కీలక నాయకులు మాత్రమే జగన్ కలుసుకుంటున్నారు. మిగిలిన వారిని పక్కన పెడుతున్నారు.
అదేవిధంగా స్థానిక సమస్యలపై కూడా పెద్ద ఎత్తున ఆయన స్పందిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. దీనిని ఇప్పుడు హైలెట్ చేస్తూ టిడిపి నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల నేపాల్ లో అల్లర్లు సంభవించాయి. విద్యార్థి ఉద్యమాలు, యువత రోడ్లమీదకు రావడంతో అక్కడ తీవ్ర స్థాయిలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశం నుంచి వెళ్లిన అనేక మంది యాత్రికులు నేపాల్ లో చిక్కుకుపోయారు. వీరిలో కడప జిల్లా నుంచి 22 మంది వరకు ఉన్నారు.
నేపాల్ లోని ఖాట్మండులో ఉన్న ప్రముఖ ఆలయాలను అదేవిధంగా పర్యాటక ప్రాంతాలను దర్శించేం దుకు రాష్ట్రం నుంచి 200 మందికి పైగా ప్రజలు అక్కడికి వెళ్ళగా ఒక కడప నుంచి మాత్రమే 22 మంది ఉన్నారు. వీరంతా కూడా అక్కడ చిక్కుకుపోయారు .వీరిని మంత్రి నారా లోకేష్ పరామర్శించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాల్లో రాష్ట్రానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి వారి సొంత గ్రామాలకు తీసుకువెళ్లి ఇళ్ల దగ్గర వదిలిపెట్టేలాగా చర్యలు తీసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టిడిపి నాయకులు వైసిపిని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
22 మంది కడపకు చెందిన ప్రజలు నేపాల్ లో చిక్కుకుపోతే కనీసం జగన్ స్పందించలేకపోయారని, ఒక్క మాట కూడా వారి గురించి చర్చించలేదని కనీసం వారికి ఫోన్ చేసి పరామర్శించలేదన్నది వీరు చేస్తున్న ఆరోపణ. దీనిలో వాస్తవం కూడా ఉంది. నేపాల్ లో సంభవించిన అల్లర్లు ఇతర అంశాల కారణంగా చిక్కుకుపోయిన తెలుగువారి విషయంలో ప్రతిపక్ష పార్టీగా జగన్ ఇంతవరకు స్పందించలేదు. వారు అక్కడ అల్లర్లలో చిక్కుకోవడం వారిని సురక్షితంగా తీసుకురావడం అన్ని జరిగిపోయాయి. దీనికి కృతజ్ఞతగా వారంతా మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేశారు.
ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి నేపాల్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయి తిరిగి వచ్చిన వారిని ఇప్పటివరకు పరామర్శించకపోవడం, కనీసం వారి గురించి మాట కూడా ప్రస్తావించకపోవడం వంటివి చర్చకు దారితీసాయి. మరీ ముఖ్యంగా తన సొంత జిల్లా కడపకు చెందిన వారిని కూడా ఆయన పరామర్శించకపోవడం పట్ల స్థానికంగా అనేక విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఇదేనా కడప పట్ల ప్రేమ అంటూ టిడిపి నాయకులు జగన్ ను ప్రశ్నిస్తున్నారు.
అదేవిధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జగన్ నైజం ఇది.. అని వ్యాఖ్యలు చేస్తున్నారు. గెలిస్తే ఒకలాగా ఓడిపోతే మరోలాగా ఆయన ప్రజల పట్ల ప్రేమ చూపిస్తారంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. ఈ పరిణామాలు వైసీపీని తీవ్రస్థాయిలో కుదిపేస్తున్నాయి అన్నది వాస్తవం. మరి దీనిపై ఇప్పటికైనా స్పందిస్తారా లేక ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. నాయకుడు అన్నవారు ప్రజల కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పట్టించుకుని తీరాలి. అప్పుడే వారికి సరైన ఫాలోయింగ్ ఉంటుంది. కానీ మరి జగన్ ఏమనుకున్నారో ఏమో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని సొంత జిల్లాకు వచ్చిన వారిని కూడా పట్టించుకోకపోవడం పట్ల విమర్శలైతే వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates