టిడిపి అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పి ఎదురవుతోంది. క్షేత్రస్థాయిలో నాయకులను ఆయన ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా.. పరిస్థితిలో మార్పు అయితే కనిపించడం లేదు. ఏడాదిన్నర కాలంగా అనే విషయాలలో క్షేత్రస్థాయి నాయకులు చేస్తున్న తప్పుల కారణంగా ప్రభుత్వం నిందలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లోనూ చులకన భావం కనిపిస్తోంది. చంద్రబాబు హెచ్చరికలు ఏమాత్రం పనిచేయడం లేదన్నది సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట.
గతంలో ఇసుక, లిక్కర్ విషయంలో నాయకులు గాడి తప్పారు. ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకుని ఉచిత ఇసుకను కూడా అమ్ముకున్న పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా రైతులకు సంబంధించిన యూరియా విషయంలో కూడా తమ్ముళ్ల ప్రభావం స్పష్టంగా ఉందన్నది చంద్రబాబుకు అందిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ నాయకులు యూరియాను దారి మళ్ళించారన్నది అధికారులు స్పష్టం చేశారు. మాట కూడా వినడం లేదని కలెక్టర్లు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు.
పలు జిల్లాల నుంచి అందిన నివేదికలను ఆధారంగా చేసుకుని చంద్రబాబు సమీక్షించినప్పుడు.. నేతలు యూరియాను దారి మళ్ళించారని, తమ తమ అవసరాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నారని చంద్రబాబుకు తెలిసింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇటువంటి నేతలను కట్టడి చేసే బాధ్యతను కలెక్టర్ల చేతిలో పెట్టారు. కానీ, కలెక్టర్లు మాత్రం అసలు మా మాట విననప్పుడు మేమేం చేస్తామని చెప్తున్నారు. నేతలను కట్టడి చేసే విషయంలో చంద్రబాబు మాత్రం కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు.
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర సిద్ధమవుతున్న క్రమంలో నేతల వైఖరి పార్టీకి.. ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగానే మారుతోంది. దేన్నీ వదలకపోవడం. ఏ విషయంలోనూ నేతలు జోక్యం చేసుకోకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడడంతో.. ఇది ఎంత మంచి చేసినా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని కట్టడం చేసేందుకు చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి.
ప్రస్తుతానికైతే ఆయన హెచ్చరికలకే పరిమితం అవుతున్నారు. అంతకుమించి కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుందోనని ఆలోచనగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో నాయకులకు చంద్రబాబు అనుసరిస్తున్న విధానం అలుసుగా మారిందన్న చర్చ కూడా నడుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates