రాష్ట్రంలో రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా ఒకరిద్దరు మంత్రుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనతో కూడా ఉన్నారు. వారు వ్యవహరిస్తున్న తీరు, కొందరు ఎమ్మెల్యేలు మంత్రులపై వస్తున్న ఆరోపణలు వంటి వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. పదేపదే వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. ఒకరకంగా ఈ పరిస్థితి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.
మంత్రులను అదేవిధంగా ఎమ్మెల్యేలను తమ పద్ధతులు మార్చుకోవాలని ఆయన ఆదేశిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు వ్యవస్థీకృతంగా అధికారుల విషయంలో కూడా చంద్రబాబుకు పెద్ద ఎత్తున తలనొప్పులు వస్తున్నాయి. ఇప్పటికీ చాలా మంది అధికారులు ప్రతిపక్ష నాయకులతో చేతులు కలిపి వ్యవహారాలు చక్కదిద్దతున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలను బయటకు పొక్కేలా చేయటం వంటివి ప్రభుత్వంలో అంతర్గతంగా తీవ్ర వివాదంగా మారుతోంది.
తాజాగా రెండు విషయాలు వెలుగు చూశాయి. ఒకటి శ్రీకాంత్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించిన తర్వాత కూడా పెరోల్ పై ఆయనను విడిచిపెట్టడం. దీనికి ఉన్నత స్థాయిలో హోం శాఖ నుంచి ఆదేశాలు వెళ్లడం. దీని వెనక కీలక అధికారి ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. వైసీపీ నాయకుల అండతో సదరు అధికారి చక్రం తిప్పారు అనేది ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్న చర్చ. ఆ అధికారి ఎవరు.. ఏంటి.. అనేది అందరికీ తెలిసినా.. చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని వెనుక ఓ కీలక మంత్రి ఉన్నారని సీఎం చంద్రబాబుకు నివేదిక అందినట్టు సమాచారం.
ఇక మరో కీలక విషయం, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యవహారం. ఈయనపై కూడా ప్రభుత్వం పార్టీ వర్గాల్లోనూ ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. వాస్తవానికి దమ్మాలపాటి శ్రీనివాస్ గతంలో 2014 -19 మధ్య టిడిపి హయాంలో అడ్వకేట్ జనరల్గా వ్యవహరించారు. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కోసం, అదేవిధంగా పార్టీ నాయకుల కోసం ఆయన పని చేశారు. అట్లాంటిది అనూహ్యంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన పిఏ బయటకు వెల్లడిస్తున్నారని సమాచారం.
ముఖ్యంగా వైసిపి నాయకులకు చేరవేస్తున్నారని తద్వారా ఇబ్బందులు వస్తున్నాయి అన్నది టిడిపి నాయకులు చెబుతున్న మాట. బయటి వారు ఎవరైనా విమర్శించి ఉంటే అది నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ, టిడిపిలో ఉన్నటువంటి అత్యంత సీనియర్ నాయకులు కూడా దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దమ్మాలపాటి పీఏగా వ్యవహరిస్తున్న ఓ సీనియర్ న్యాయవాది కీలక అంశాలను వెల్లడిస్తున్నాడని తద్వారా వైసిపి నాయకులు పలు కేసుల్లో నుంచి సునాయాసంగా బయటపడుతున్నారని ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
నిజానికి దమ్మాలపాటి శ్రీనివాస్ కు చంద్రబాబుకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయనను అనుమానించాల్సిన అవసరం లేకపోయినా ఆయన పిఏ ద్వారా జరుగుతున్న వ్యవహారాలు చూసి చూడకుండా వ్యవహరిస్తున్నారా లేకపోతే ఆయనకు తెలిసి జరుగుతున్నాయా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినట్టు సమాచారం. దీనిపై నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయని, అవసరమైతే దమ్మాలపాటి శ్రీనివాస్‌తో భేటీకి సిద్ధమవుతారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవైపు రాజకీయ నాయకులు మరో వైపు వ్యవస్థలు కూడా ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వానికి మరిన్ని తలనొప్పులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates