అవినాష్ వ‌ల్ల కాలేదు.. వైసీపీ వాట్ నెక్ట్స్..!

వైసీపీలో చూసి ర‌మ్మంటే.. కాల్చుకువ‌చ్చే నాయ‌కులు చాలా మంది ఉన్నారు. అయితే.. ఒక్కొక్క సారి ఇవి వివాదాల‌కు దారి తీసినా.. పార్టీకి మేలు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు కుప్పం ముని సిప‌ల్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌ట్లో అప్ప‌గించారు. ఆయ‌న మిగిలిన వారిని తోడు తీసుకుని ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. తిరుప‌తి ఎన్నిక‌ల‌ను భూమ‌న‌తో పాటు.. చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి కూడా అప్ప‌గించారు. ఇద్ద‌రూ స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగి విజ‌యం సాధించారు.

కానీ, ఇప్పుడు పులివెందుల విష‌యానికి వ‌స్తే.. మాత్రం బెడిసి కొట్టింది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌న్న‌ది పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌.

1) కేవలం అవినాష్‌: పులివెందుల విష‌యంలో విజయం ద‌క్కించుకునేలా చేసేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను.. అవినాష్ భుజాన వేసుకున్నారు. నిజానికి వేరే నాయ‌కుల‌ను కూడా క‌లుపుకొని పోవాల‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిలో అంజాద్ బాషా స‌హా.. ప‌లువురు ఉన్నారు. కానీ, వారి వ్యూహాల‌ను.. ఎత్తుగ‌డ‌ల‌ను అవినాష్ ప‌ట్టించుకోలేదు. పులివెందుల విజ‌యం ద‌క్కించుకుంటే.. అది పూర్తిగా త‌న ఖాతాలోనే ప‌డాల‌న్న ఉద్దేశంతో అవినాష్ వ్య‌వ‌హ‌రించార‌న్న చ‌ర్చ ఉంది. ఇది బెడిసికొట్టింది.

2) ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు: ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. నాయ‌కులు ఏక‌ప‌క్షంగా ముందుకు సాగ‌డం అనేది ఉండ‌కూడ‌దు. ప్ర‌త్య‌ర్థుల బ‌లాబ‌లాల‌ను కూడా అంచ‌నా వేసుకునే ప్ర‌క్రియ‌ను పాటించాలి. కానీ, అవినాష్ ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేశారు. ఫ‌లితంగా పార్టీ ప‌రంగా ఆయ‌న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకున్నారు. దీంతో పులివెందుల‌లో ఓట‌మి కాదు.. డిపాజిట్ కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

వీటికితోడు.. సింప‌తీని ర‌గిలించ‌లేక‌పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అంటున్నారు. నిజానికి హేమంత్ రెడ్డికి సింప‌తీ తోడ‌వ్వాలి. త‌న తండ్రి అకాల మ‌ర‌ణంతో వ‌చ్చిన ఎన్నిక కావ‌డంతో ఆయ‌న‌కు స‌హ‌జం గానే సింప‌తీ పాళ్లు రావాలి. కానీ, అలా రాలేదు. పైగా.. ఆ విష‌యాన్నే వ‌దిలేసి… సూప‌ర్‌6 హామీల వైఫల్యాన్ని మాత్ర‌మే ప‌ట్టుద‌ల‌తో ప్ర‌చారం చేశారు. ఇది అంత‌గా క‌లిసి రాలేదు. దీంతో అవినాష్ రెండు ర‌కాలుగా విఫ‌ల‌మ‌య్యారు. ఫ‌స్ట్ టైమ్ బాధ్య‌త‌లు అప్ప‌గించిన త‌ర్వాత‌.. త‌న స‌త్తా నిరూపించుకుంటాన‌ని ఆయ‌న చెప్పినా.. ఫెయిల్ కావ‌డంతో జ‌గ‌న్ సైతం అంత‌ర్మ‌థ‌నంలో కూరుకుపోయారు.