భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఓ కీలక అంశంపై జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే.. వాటి వెనుక ఉన్న పెను ముప్పును కూడా పవన్ కల్యాణ్ వివరించి.. అందరినీ ఆలోచనలో పడేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీల గురించి ప్రస్తావిస్తూ… ఓడిపోతేనే ఓట్ చోరీ గుర్తుకు వస్తుందా? అంటూ చురకలు అంటించారు.
2019లో వైసీపీ గెలిచి, తాము ఓటమిపాలు అయినప్పుడు తామేమీ ఓట్ చోరీ అనీ, ఈవీఎం ట్యాంపరింగ్ అనీ అనలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించామని, ప్రజా తీర్పును గౌరవించామని గుర్తు చేశారు. అయితే 2024లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ.. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, దానితోనే కూటమి విజయం సాధించిందని, ఈ ఎన్నికలు సక్రమంగా జరగలేదని అసత్య ఆరోపణలు చేసిందని అన్నారు. వైసీపీ గెలిస్తే… ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదని, అదే వైసీపీ ఓడితే మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ఇక ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారంపైనా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును ఓట్ చోరీతో పోలుస్తారా? అని ఆయన మండిపడ్డారు. దీని వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు. భారత దేశాన్ని అస్థిర పరచేందుకు విదేశీ శక్తులు నిత్యం యత్నిస్తూనే ఉన్నాయని, వాటికి వత్తాసు పలికి రాజకీయ లబ్ధి పొందేలా దేశంలోని కొందరు నేతలు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. దేశంలోని వ్యక్తి సాయం లభిస్తే… దేశాన్ని అస్థిరపరచే పని విదేశీ శక్తులకు ఈజీ కదా అని కూడా పవన్ వివరించారు. ఈ తరహా కుట్రలకు పాల్పడే రాజకీయ నేతలను జనాలు గమనించాలని, వారి కుయుక్తులను భగ్నం చేసే దిశగా కదలాలని ఆయన పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates