మాజీ ఉప రాష్ట్రపతి.. వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బూతులు మాట్లాడిన బూతు నేతలు.. గుండుగుత్తగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఇక, వారు మళ్లీ గెలుస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. బూతులు మాట్లాడేవారిని పోలింగ్ బూత్‌ల ద్వారా ప్రజలే నిలువరిస్తున్నారని చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లో ‘విలీనం-విభజన’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజకీయాల్లో ఉన్నవారు విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, ఇప్పుడున్నవారిలో ఈ లక్షణాలు కనిపించడం లేదు. పోనీ.. కనీసం నోరైనా అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. వాగ్బూషణం-భూషణం.. అన్నట్టుగా.. మాట్లాడే ప్రతిమాటను తూకం వేసి మాట్లాడడం నేర్చుకోండి. బూతులు మాట్లాడడం.. ద్వంద్వార్థ పదాలు మాట్లాడడం.. ఇప్పుడు నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. అవి రాజకీయాల్లో మంచి చేయవు. ప్రజలు బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్‌ల ద్వారా బుద్ధి చెబుతారు.” అని వ్యాఖ్యానించారు.
తాను నెల్లూరుకు వెళ్లినప్పుడు.. కొందరు మహిళలు తన ఇంటికి వచ్చారని.. వారంతా బూతులు మాట్లాడే నాయకులపై ఫిర్యాదులు చేశారని.. కానీ, తాను ఏమీ చేయలేనని.. మీ చేతిలోనే బూత్‌లు ఉన్నాయని వాటి ద్వారానే వారికి సమాధానం చెప్పాలని దిశానిర్దేశం చేసినట్టు వెంకయ్య తెలిపారు. ఇలా పరోక్షంగా అప్పటివైసీపీ నాయకులపై వెంకయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మీడియా పాత్ర కీలకమన్న ఆయన.. మంచి చెడులను ప్రజలకు వివరించే గురుతర బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates