జ‌గ‌న్ అరస్ట్ అంత తేలిక కాదు?

వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేశారు. వీరిలో రాజంపేట ఎంపీ, వైసిపి కీలక నాయకుడు మిథున్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్ దగ్గర పనిచేసిన ఓ ఎస్ డి లు పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఈ పరిణామాలు ఎలా ఉన్నా.. ఈ కేసులో ప్రధానంగా జగన్ ను అరెస్ట్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ఇప్పటికే అనేక కథనాలు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇతర వ్యక్తులను లేదా ఇతర వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినంత ఈజీగా జగన్‌ను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. దీనికి అనేక రాజకీయ కారణాలు.. ప్రజల్లో ఏర్పడే సింప‌తీ వంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజల్లో సింప‌తీ పై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు జగన్ అరెస్ట్ చేస్తే ఎలాంటి సంపతి వస్తుంది.. ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి ఉందా లేదా అనే విషయాలను అంచనా వేసి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

కానీ.. రాజకీయంగా చూసుకున్నప్పుడు మాత్రం ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా కేంద్రాల్లోని బిజెపి నాయకులు దీనికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదన్నది కూటమి ప్రభుత్వంలోని నాయకులు మధ్య జరుగుతున్న చర్చగా ఉంది. ఎందుకంటే బిజెపి రాజకీయాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉంటాయి. ఒకే పార్టీతో అది అంట‌కాగ‌డ‌మ‌న్న‌ సమస్య ఉండదు. ఎప్పుడు ఏ అవసరం ఎలా వచ్చినా వినియోగించుకునేందుకు ఏ పార్టీ నైనా వాడుకునేందుకు బిజెపి నాయకులు రెడీగా ఉంటారు.

కేంద్రంలో తరచుగా అవసరాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నిక కూడా ఉంది. రాజ్యసభలో వైసిపి అవసరం బిజెపికి ఎక్కువగా కనిపిస్తుంది. వైసిపి పక్షాన బిజెపి నాయకులు ఖచ్చితంగా నలబడతారనేది జాతీయ మీడియాలో జరుగుతున్న చర్చ. పైగా ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలు గమనిస్తే కేంద్రం కోరినప్పుడు రాజ్యసభ సీట్ ఇచ్చారు. అనేక సందర్భాల్లో బిల్లులకు కూడా వైసీపీ తరఫున మద్దతునిచ్చారు. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా కేంద్రంలోని బిజెపి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.

జ‌గ‌న్ అరెస్టుకు రాజకీయంగా ఇదే ప్రతిబంధకం అవుతుంది అన్నది కూటమిలోనే జరుగుతున్న చర్చ. మొత్తంగా చూస్తే ఈ కేసును పరుగులు పెట్టించడం లేదా అరెస్టులు చేయటం వంటివి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ఉన్నప్పటికీ కీలకమైన జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.