దేశ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ వ్యవహారం.. విస్మయానికి గురి చేస్తోంది. ఆయన రాజీనామానే ఒక పెద్ద సంచలనం అయితే.. ఆ తర్వాత.. జరుగుతున్న పరిణామాలు అంతకు మించిన సంచలనాలుగా మారుతున్నాయి. సాధారణంగా.. ఉపరాష్ట్రపతి వంటి పెద్ద పదవుల్లో ఉన్న వారు సడెన్‌గా రాజీనామా చేయడం అనేది లేదు. ఒకే ఒక్క సారి వీవీ గిరి రాజీనామా చేసినా..ఆయన రాష్ట్రపతి పదవిలో పోటీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన రాజీనామా వ్యవహారం చర్చకు రాలేదు.
కానీ.. ఆ తర్వాత.. జగదీప్ ధన్‌ఖడ్ ఒక్కరే.. 2 సంవత్సరాల పదవీ కాలం ఉండగా.. రాజీనామా సమర్పించారు. పైగా అదికూడా సాయంత్రం వరకు ..రాజ్యసభకు సంబంధించిన విధుల్లో ఉండి.. హఠాత్తుగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇదొక సంచలన మైతే.. ఆయన రాజీనామా చేసిన తర్వాత.. కనీసం ఆయనతో కేంద్రం కానీ.. రాష్ట్రపతి కానీ.. ఎక్కడా సంప్రదింపులు.. చర్చలు చేయకుండానే చేసింది తడవుగా రాజీనామాను ఆమోదించేశారు. ఇది మరో సంచలనం.
ఇక, ఇప్పుడు మరో విషయం తెరమీదికి వచ్చింది. ఉపరాష్ట్రపతి రాజీనామా అనంతరం.. ఆయనను ఘనంగా సత్కరించి.. రాజ్యసభలో గౌరవంగా ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్పి.. ప్రశంసించి.. వీడ్కోలు పలుకుతారు. ఇది గౌరవం… సంప్రదాయం కూడా. తెలుగు నాయకుడు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవి నుంచి విరమణ పొందినప్పుడు.. ఇలానే జరిగింది. గతంలో హమీద్ అన్సారీ(ఈయన పదేళ్లు చేశారు) విరమణ సమయంలోనూ.. ఇలానే గౌరవంగా సాగనంపారు.
కానీ.. ఇప్పుడు జగదీప్ విషయంలో కేంద్రం ఆ గౌరవాన్ని కూడా ఇచ్చేందుకు ముందుకు రాలేదు. వాస్తవానికి ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినా.. విరమణ పొందినా.. ప్రభుత్వ పక్షం ముందుకు వచ్చి.. వీడ్కోలు కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అన్ని పక్షాలను ఆహ్వానిస్తుంది. ఒక రోజు సభను కేటాయిస్తుంది. ఆ సభలో ఆయనను ప్రశంసించి సాగనుంపుతారు. కానీ.. ఈ దఫా.. విపక్షాలే ముందుకు వచ్చాయి. జగదీప్ ధన్‌ఖడ్‌ను గౌరవంగా సంప్రదాయ బద్ధంగా సాగనంపేందుకు రెడీ అయ్యాయి.
దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించింది. కానీ, కేంద్రం దీనిని పక్కన పెట్టింది. అంటే.. జగదీప్‌కు.. వీడ్కోలు సభ కానీ.. గౌరవ ప్రదమైన సాగనంపడం.. కానీ.. లేవు. సో.. చేసుకున్న వారికి చేసుకున్నంత! అనే నానుడి జగదీప్ విషయంలో వినిపిస్తోంది. వాస్తవానికి ఆది నుంచి బీజేపీని ఆయన మోశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు.. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత.. ధన్‌ఖడ్.. కేంద్రంలోని మోడీ సర్కారును అధికార పార్టీ నాయకుల కంటే ఎక్కువగా సమర్థించారు.
న్యాయ వ్యవస్థపై కూడా ఆయన వ్యాఖ్యలు చేసి.. వివాదమయ్యారు. అభిసంశన తీర్మానం కూడా ఎదుర్కొన్నారు. ఇవన్నీ.. ఆయన ఎవరి కోసం చేశారంటే.. బీజేపీ కోసం.. మోడీ కోసమే!. కానీ.. ఇప్పుడు వారే ఆయనను పక్కన పెట్టారన్నది జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి స్పష్టమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates