తెలంగాణలో ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ పోటీ చేయలేదు. తొలిసారిగా ఇక్కడ ఆ పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజుల కిందటే సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటన విడుదల చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయని.. వారి వినతి మేరకు ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులకు, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేసినట్లు పవన్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నట్లు చెప్పిన పవన్.. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు డివిజన్లలో జనసేన కమిటీ క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడటం, తమ కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించుకోవడం జరిగిందని.. ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని తెలిపాడు.
ఐతే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో జనసేన ఆ పార్టీతోనే కలిసి పోటీ చేస్తుందా లేదా అన్నది మాత్రం ఈ ప్రకటనలో పేర్కొనలేదు. మరి ఈ విషయంలో పవన్ ఏం నిర్ణయిస్తారో చూడాలి. 2014 ఎన్నికల తర్వాత పవన్ ఎప్పుడూ ఇక్కడి అధికార టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేసింది లేదు. ఇప్పుడు బీజేపీతో కలిస్తే కచ్చితంగా కేసీఆర్‌ను టార్గెట్ చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంలా మారిన బీజేపీ టీఆర్ఎస్‌ను ఎలా ఢీకొడుతోందో తెలిసిందే. మరి ఆ పార్టీతో కలిసి జనసేన టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయగలదా అన్నది సందేహం.