చెప్పి ఒప్పిద్దాం.. అమ‌రావ‌తిపై బాబు డెసిష‌న్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని జాతీయ స్థాయిలో కాకుండా.. అంత‌ర్జాతీయ స్థాయికి విస్త‌రించాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న ప్లాన్ వేరైతే.. ఇప్పుడు దానిని హైలెవిల్‌కు తీసుకు వెళ్లారు. ఐటీ, ఏఐ, క్వాంట‌మ్ వ్యాలీ స‌హా.. అనేక రంగాల‌కు.. అమ‌రావ‌తిని హ‌బ్‌గా మార్చాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పం. ఈ క్ర‌మంలోనే.. ఇప్ప‌టికే తీసుకున్న 34 వేల ఎక‌రాల‌కు అనుబంధంగా మ‌రో 44 వేల ఎక‌రాల‌ను సమీక‌రించేందుకు(పూలింగ్‌) సిద్ధ‌మ‌య్యారు.

అయితే.. దీనికి సంబంధించి 20 వేల ఎక‌రాలు మాత్ర‌మే ఇచ్చేందుకు రైతులు ముందుకు వ‌చ్చారు. మిగిలిన 24 వేల ఎక‌రాల సంగ‌తి సందిగ్ధంలో ప‌డింది. రైతులు దీనిని ఇచ్చేందుకు ముందుకు రావ‌డం లేదు. పైగా.. కేసులు వేసేందుకు రెడీ అవుతున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం భూస‌మీక‌ర‌ణ‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల‌లో సీఎం చంద్ర‌బాబు సింగపూర్ వెళ్లేలోపే దీనిపై ఒక నిర్ణ‌యం తీసుకుంటారు. కొత్త‌గా తీసుకునే భూమిని తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల నుంచి సమీక‌రించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో అక్క‌డ గ్రామ స‌భ‌లు కూడా నిర్వ‌హించారు. కానీ, ఏడు గ్రామాల్లో 3 ముందుకు వ‌చ్చి.. భూములు ఇచ్చేందుకు ఓకే చెప్పినా.. మిగిలిన 4 గ్రామాల్లోనే వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. అయితే.. వీరిని బ‌ల‌వంతంగా దారికి తెచ్చుకునేందుకు సీఎం చంద్ర‌బాబు ససేమిరా అంటున్నారు. వారిని న‌యాన ఒప్పించి.. అమ‌రావ‌తికి సంబంధించిన భూములు తీసుకుందామ‌ని ఆయ‌న మంత్రి వ‌ర్గానికి తేల్చి చెప్పారు. ఇదే విష‌యంపై సీఆర్డీఏ అధికారులు స‌హా.. జిల్లా కలెక్ట‌ర్‌కు కూడా వివ‌రించారు. రైతుల‌ను బెదిరించో.. బాధ పెట్టో భూములు తీసుకోవ‌డం మంచిది కాద‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో ఈనెలాఖరులోపే పూలింగు నోటిఫికేషన్ ఇచ్చి.. దీనికి ముందు రైతుల‌తో స‌మావేశం కావాల‌ని.. కూట‌మి పార్టీల నాయ‌కుల‌ను కూడా క‌లుపుకొని వెళ్లి రైతుల‌ను ఒప్పించి భూములు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.న ఒక్కో రెవెన్యూ గ్రామానికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ల నియామక ప్రక్రియను వేగవంతం చేశారు. వీరిని ప్ర‌తి రైతుతో ప్ర‌త్యేకంగా మాట్లాడించి.. రైతుల‌ను ఒప్పించాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. త‌ద్వారా.. వివాద ర‌హితంగా భూములు తీసుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.