బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇక లేనట్టేనా…

న‌ట‌సింహం, టీడీపీ నాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌కవ‌ర్గంలో వైసీపీ దాదాపు లేకుండా పోయింద‌నే టాక్ వెలుగు చూసింది. పార్టీకి ఇప్ప‌టి వ‌ర‌కు మూల స్థంభాలుగా ఉన్న ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌ పై తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. దీంతో అంతో ఇంతో ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగుతున్న వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా కొడిక‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని స్థానిక రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీని బ‌లోపేతం చేసుకోవాలి.

కానీ, వైసీపీలో అలాంటి రాజ‌కీయ సంస్క‌ర‌ణ‌లు ఎక్క‌డా లేక‌పోగా.. పార్టీలో స‌స్పెన్ష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుండ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హిందూపురంలో క‌మ్మ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ న‌వీన్ నిశ్చ‌ల్‌, వేణుగోపాల్ రెడ్డి ఇద్ద‌రూ కూడా.. వైసీపీ వెన్నుద‌న్నుగా ఉన్నారు. న‌వీన్ నిశ్చ‌ల్ రెండు సార్లు టికెట్ తెచ్చుకుని పోటీ చేశారు. ఒక‌సారి గెలిచారు. 2014లో ఓడిపోయారు. దీంతో 2019లో ఇక్బాల్‌కు, 2024లో దీపిక అనే మ‌హిళ‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు.

అయితే.. అప్పుడు కూడా ఆ ఇద్ద‌రూ ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఓడిపోయిన నాయ‌కులు ఎక్క‌డా క‌నిపించడంలేదు. అంతో ఇంతో.. న‌వీన్ నిశ్చ‌ల్ స‌హా వేణు గోపాల్ రెడ్డిమాత్ర‌మే మీడియా ముందుకు వ‌స్తున్నారు. పార్టీని బ‌ల‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఖాయ‌మ‌ని న‌వీన్ ప్ర‌క‌టించారు. ఇదే పెద్ద నేరం అయిన‌ట్టుగా వైసీపీ అధిష్టానం ఆయ‌న‌ను, ఆయ‌న‌కు మద్ద‌తుగా నిలిచిన వేణుగోపాల్‌రెడ్డిని కూడా పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది.

ఈ ప‌రిణామాల‌తో హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్టు అయింది. అంతేకాదు.. పార్టీ త‌ర‌ఫున ఇప్ప‌టి వ‌ర‌కు జెండా మోసిన కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా హ‌ర్ట్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌పై మ‌రోసారి పార్టీ ఆలోచ‌న చేసుకోక‌పోతే.. హిందూపురంలో వైసీపీ జెండా ఎగ‌ర‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో టికెట్ పొంది ఓడిపోయిన ఇక్బాల్‌కు.. వైసీపీ అధినేత ఎమ్మెల్సీ అవ‌కాశం ఇచ్చినా.. ఆయ‌న పార్టీలో ఉండ‌కుండా.. మారిపోయారు. టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. న‌మ్మి పార్టీలో ఉన్న వారిపై వేటు వేయ‌డం స‌రికాద‌న్న వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.