బీఆర్ఎస్‌లో కేటీఆర్‌.. జీరో.. ఓ రేంజ్‌లో సీత‌క్క ఫైర్‌

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌పై మంత్రి సీత‌క్క‌.. ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ పార్టీ అస‌లు ఎక్క‌డుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఆ పార్టీ ఎప్పుడో చ‌చ్చిపోయింద‌న్నారు. లేని పార్టీ గురించి మాట్లాడుకోవడం వృథా అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేటీఆర్‌.. బీఆర్ఎస్‌లో నెంబ‌ర్ 2 కాద‌న్న ఆమె.. ‘జీరో’ అని పేర్కొన్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీత‌క్క‌.. బీఆర్ఎస్‌లో నెంబ‌ర్ గేమ్ జ‌రుగుతోంద‌న్నారు.

తానే నెంబ‌ర్ 2 అని క‌విత చెబుతున్న విష‌యాన్ని కేటీఆర్ అర్థం చేసుకోవాల‌ని సీత‌క్క సెటైర్లు గుప్పించారు. “బీఆర్ఎస్ ఎప్పుడో చ‌చ్చిపోయింది. దీనిలో కేటీఆర్ నెంబ‌రు 2 కాదు.. జీరో. ఈ మాట నేనేమీ చెప్ప‌డం లేదు. ఆయ‌న చెల్లెలు క‌వితే చెబుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది వాస్త‌వం కాదా? దీనికి కేటీఆర్ స‌మాధానం చెప్పాలి. క‌వితే అన్నీ అయి పార్టీని న‌డిపిస్తాన‌ని అన్న‌ది నిజం కాదా?. దీనికి కేటీఆర్ స‌మాధానం చెప్ప‌కుండా.. ఇంకా బీఆర్ఎస్‌లో తానే నాయ‌కుడిన‌ని అనుకుంటున్నారు” అని సీత‌క్క ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి.. కేటీఆర్ పై మాట్లాడ‌డం ఎప్పుడో మానేశార‌ని సీత‌క్క చెప్పారు. సీఎం ఎప్పుడు మాట్లాడినా.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నార‌ని తెలిపారు. స‌వాల్ రువ్వింది కూడా కేసీఆర్ కేన‌ని.. కేటీఆర్‌కు కాద‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విష‌యం అంద‌రికీ అర్ధ‌మైనా.. కేటీఆర్‌కు అర్ధం కావ‌డం లేద‌న్నారు. అది కూడా ప్ర‌తిప‌క్ష నేత హోదా ఉంది కాబ‌ట్టి.. సీఎం మాట్లాడుతున్నార‌ని.. అది లేక‌పోతే.. బీఆర్ఎస్ గురించి ఎవ‌రూ స్పందించ‌ర‌ని చెప్పారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇటీవ‌ల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తానే కాబోయే సీఎంన‌ని చెప్పుకొచ్చారు. పార్టీలో తానే పోరాటాలు చేస్తున్నాన‌న్నారు. మిగిలిన వారు.. వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నార‌ని.. ఆమె కేటీఆర్‌ను ఉద్దేశించి ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ నాయ‌క‌త్వాన్ని తీసుకునే కేప‌బిలిటీ త‌న‌కే ఉంద‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. తాజాగా సీత‌క్క కేటీఆర్‌ను కార్న‌ర్ చేయ‌డం గ‌మ‌నార్హం.