ఏపీలో నిల‌క‌డ లేని నేత‌లు.. స్వ‌యంకృత త‌ప్పులు ..!

రాష్ట్రంలో ఒకప్పుడు సుదీర్ఘ రాజకీయాలు చేసి.. మంత్రి పదవులు అనుభవించిన పలువురు నాయకులు ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. నిలకడలేని అడుగులు, నిలకడలేని రాజకీయాలు చేసిన కారణంగా వారు ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ పార్టీల్లోనూ పెద్దగా గుర్తింపు పొందలేకపోతున్నారనేది వాస్తవం. ఇలాంటి వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్, అదేవిధంగా మేకతోటి సుచరిత, రావెల కిషోర్ బాబు వంటి కీలక నాయకులు కనిపిస్తున్నారు.

చిత్రం ఏంటంటే వీరందరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో ఒకప్పుడు ఎదురులేదన్నట్టుగా చక్రం తిప్పారు. కానీ తర్వాత పరిణామాలలో మాత్రం రాజకీయంగా వారు తీసుకున్న‌ నిర్ణయాలు వేసిన అడుగులు పార్టీలకు దూరం చేశాయి. ఇప్పుడు పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటున్న వారికి ఎలాంటి ప్రాధాన్యం కూడా తగ్గడం లేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ అయితే… ఇప్పటికి మూడు పార్టీలు మారారు. ప్రస్తుతం టిడిపిలో ఉన్నారు. కానీ, ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో కాంగ్రెస్లో ఉన్నాయన రాష్ట్ర విభజన తర్వాత టిడిపిలో చేరాలని భావించారు.

కానీ అనూహ్యంగా వైసిపిలోకి వచ్చారు. ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. దీనికి తోడు ఆయన కోరుకున్న నియోజకవర్గంలో లభించట్లేదని భావించిన ఆయన గత ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఇక్కడ కూడా ఆయన ఎమ్మెల్సీ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పదవి దక్కలేదు. ప్రాధాన్యం కూడా అంతంత మాత్రమే. దీంతో రాజకీయంగా ఆయ‌న మైన‌స్ అయ్యార‌ని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఇక వైసీపీలోనే ఉన్నానని చెప్పుకుంటున్న మేకతోటి సుచరిత.. జగన్ హయాంలో హోం శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రి పదవి నుంచి తొలగించడంతో అప్పటినుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా పార్టీ మారుతున్నామనే సంకేతాలను తరచుగా ఇస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసిన ఆమె అయిష్టంగానే ఎన్నికల బరిలోకి దిగారు. ఇది కూడా ఆమెకు వ్యక్తిగతంగా నష్టాన్ని తీసుకొచ్చింది. కూటమి ప్రభావంతో ఓడిపోయామని చెబుతున్నప్ప‌టికీ.. వ్యక్తిగతంగా ఆమె చేసుకున్న పొరపాట్లు. తీసుకున్న నిర్ణయాలు తాడికొండలో ఆమెను పరాజ‌యం పాలు చేశాయి.

పోనీ, ఆ తర్వాత అయినా పార్టీలో నిలకడగా ఉన్నారంటే.. ఏడాదికాలంగా ఆమె ఎక్కడా కార్యక్రమాల్లో కనిపించడం లేదు. పార్టీపరంగా ఎక్కడ ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాజాగా నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి కూడా ఆమె గైర్హాజరయ్యారు. అంటే ఆమె పార్టీలోనే ఉన్న పెద్దగా స్పందించడం లేదనేది స్పష్టం అవుతుంది. ఇది వ్యక్తిగతంగా, రాజకీయంగా మైనస్ మార్కులు పడేలా చేసింది.

ఇక రావెల్ కిషోర్ బాబు విషయానికి వస్తే ఈయన కూడా పార్టీలు మారి చేసిన తప్పులు. చేసిన పొరపాట్లు స్వయంకృతంగా ఆయన తన రాజకీయ జీవితాన్ని తప్పుదారి పట్టించారని భావన వ్యక్తం అవుతుంది. టిడిపిలో ఉండగా తొలిసారి విజయం దక్కించుకున్నప్పటికీ చంద్రబాబు 2014 -19 మంత్రి పదవిని ఇచ్చారు. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని ఉంటే బాగుండేది. కానీ తెలంగాణలో జరిగిన ఘటన తన కుమారులపై కేసు నమోదు కావడం వంటి పరిణామాలతో టిడిపి నుంచి బయటికి వచ్చారు.

ఆ తర్వాత చంద్రబాబు వ్యతిరేకించిన వ్యక్తులతో ఆయన చేతులు కలిపారు. తద్వారా రాజకీయంగా ఆయన మైనస్ అయ్యారు. ఆ తర్వాత బిజెపిలోకి వెళ్లారు. కొన్ని రోజులు జనసేనలో ఉన్నారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే ఎస్సీ నాయకులే అయినప్పటికీ ఒకప్పుడు ప్రజలకు చేరువైన వీరు ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉండటం.. ప్రజలు కూడా వీరిని పట్టించుకోకపోవడంతో రాజకీయ భవిష్యత్తు దాదాపు లేకుండా పోయిందని చెప్పాలి.