లిక్కర్ కేసులో చెవిరెడ్డి అరెస్టు

ఏపీలో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణంలో అరెస్టు పరంపర కొనసాగుతోంది. సోమవారం దాకా ఈ కేసులో ఏడుగురు నిందితులు అరెస్టు కాగా… మంగళవారం రాత్రి మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు అయిన వారిలో వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన బాల్య మిత్రుడు వెంకటేశ్ నాయుడు ఉన్నారు. వీరిద్దరూ బెంగళూరు నుంచి శ్రీలంక పారిపోతుండగా… ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంతో సిట్ అధికారులు అరెస్టు చేశారు.

తనకు మద్యం అలవాటే లేదని, అలాంటిది తాను మద్యం కుంభకోణంలో ఎలా పాలుపంచుకుంటానంటూ చెవిరెడ్డి తనదైన శైలి వాదన వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు చెవిరెడ్డి ఫ్యామిలీ రెండు చోట్ల పోటీకి దిగింది. చంద్రగిరి నుంచి తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బరిలోకి దింపిన చెవిరెడ్డి… తాను మాత్రం ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో డబ్బు అవసరం పడిందో, లేదంటే ఊరకే వస్తున్న దానిని ఎందుకు వద్దనాలని అనుకున్నారో తెలియదు గానీ…కసిరెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి చెవిరెడ్డి ఏకంగా రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు అందుకున్నారట.

ఈ నిధులను చెవిరెడ్డి ఎన్నికల్లో ఖర్చు చేసినట్లుగా సిట్ ఆధారాలు సేకరించింది. కసిరెడ్డి నుంచి ఈ నిధులను చెవిరెడ్డి వద్దకు తరలించే పనిని చెవిరెడ్డి బాల్యమిత్రుడు వెంకటేశ్ నాయుడు దిగ్విజయంగా పూర్తి చేశారట. ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్మును అందజేస్తే అనుమానం వస్తుందని భావించిన కసిరెడ్డి… ఎన్నికలకు ముందు 6 నెలల నుంచి కొద్ది కొద్దిగా చెవిరెడ్డికి ముట్టజెప్పారట. ఇక ఈ నిధుల తరలింపు, వాటిని ఎన్నికల్లో ఖర్చు పెట్టే వ్యవహారంలో చెవిరెడ్డికి మరో ముగ్గురు వ్యక్తులు సహకరించారట. బాలాజి యాదవ్, నవీన్, హరీశ్ లు ఈ పని చేయగా… తాజాగా వీరినీ మద్యం కేసులో నిందితులుగా చేరుస్తూ సిట్ మంగళవారం మధ్యాహ్నమే ట్రయల్ కోర్టులో మెమో దాఖలు చేసింది.