కోటి పరిహారం.. వైద్య ఖర్చులూ మావే: టాటా సన్స్

ఘోర విమాన ప్రమాదానికి కారణమైన ఎయిర్ ఇండియా భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవలి దాకా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే నడిచేది. అయితే కారణాలేమిటన్నది స్పష్టంగా తెలియదు గానీ.. ప్రభుత్వ నిర్వహణలోని ఈ సంస్థ టాటా సన్స్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు తన విమానం ప్రమాదానికి గురి కావడంతో పరిహారారాలను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గురువారం సాయంత్రం ప్రకటించారు.

ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం అందించనున్నట్లు చంద్రశేఖరన్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన…ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక విమాన ప్రమాదం కారణంగా గాయపడ్డ స్థానికులకు అయ్యే వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని ఆయన ప్రకటించారు. ఇక ప్రమాదం కారణంగా కూలిపోయిన మెడికల్ కాలేజీ భవనాన్ని తామే పునర్ నిర్మించి ఇస్తామని కూడా చంద్రశేఖరన్ తెలిపారు. ప్రమాదం కారణంగా ఇతరత్రా జరిగిన నష్టాలన్నింటినీ తాము భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే… ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్ రకానికి చెందినది. ఈ విమానాలు పాసెంజర్ రవాణాలో ఎంతో పేరేన్నిక గన్నది. ఇప్పుడు అహ్మదాబాద్ లో కూలిన ఏఐ 171 కూడా ఈ రకానికి చెందినదే కాగా…ఈ విమానం గత వారం రోజుల్లో చాలా దేశాలను భారీ సంఖ్యలో ప్రయాణీకులను తీసుకుని వెళ్లి… తిరిగి అక్కడి నుంచి అంతే మోతాదులో ప్రయాణికులను భారత్ కు తీసుకువచ్చింది. గురువారం కూడా ఇతర దేశాల నుంచే వచ్చిన ఈ విమానం ఆ తర్వాత లండన్ బయలుదేరి అహ్మదాబాద్ లో కుప్పకూలిపోయింది.