వైసీపీ అధినేత జగన్ పై తరచుగా విమర్శలు గుప్పించే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తాజాగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ‘వెధవ’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళ న, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ఆమె మరో సంచలన వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు. “జగన్ పుట్టినప్పు డే.. విజయమ్మ గొంతు నులిమి చంపేసి ఉంటే బాగుండేది” అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇప్పుడు సదరు మీడియా ఛానెల్ క్షమాపణలు చెబుతుందా? అని ప్రశ్నిస్తున్నాయి.
ఏం జరిగింది?
అమరావతిలో ‘ఆ తరహా’ మహిళలు ఉన్నారంటూ.. జగన్‌కు చెందిన మీడియా ఛానెల్ లో ఓ వ్యాఖ్యాత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ దుమారం నాలుగు రోజులుగా సాగుతోంది. దీనిపై ఓ ప్రధాన టీవీ ఛానెల్‌లో చర్చ నడుస్తోంది. వరుసగా కీలక పార్టీ నాయకులు, అమరావతి ఉద్యమంలో పాల్గొన్నవారిని పిలిచి దీనిపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం రాత్రి సదరు మీడియా ఛానెల్ నిర్వహించిన చర్చలో కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యురాలు.. రేణుకా చౌదరి పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ఇన్ ద్వారా లైవ్ షోలో పాల్గొని తన అభిప్రాయం చెప్పారు.
అమరావతిపై ఆది నుంచి వైసీపీకి అక్కసు ఉందన్నారు. జగన్ కూడా మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతుల గొంతు నులిమే ప్రయత్నం చేశారని అన్నారు. ఇవన్నీ కామనే. అయితే.. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి గురైన రేణుకా చౌదరి.. “అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పాల్సిందే. అయితే.. జగన్ మీడియా ముందుకు వచ్చే సాహసం చేయని వెధవ” అని వ్యాఖ్యానించారు. దీంతో ప్యానల్‌లో ఉన్నవారు షాకయ్యారు.
అంతేకాదు. “జగన్ పుట్టినప్పుడే విజయమ్మ గొంతు నులిమేసి ఉంటే పీడా పోయేది. ఈ బాధలు తప్పేవి” అని రేణుకా చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమయంలో యాంకర్ ఆమెను వారించే ప్రయత్నం చేశారు. కానీ, ఫైర్‌బ్రాండ్ తగ్గలేదు. ఇదిలావుంటే.. ఈవ్యాఖ్యలపై వైసీపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఇప్పుడు సదరు మీడియా తమకు క్షమాపణలు చెప్పాలని.. డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఎలాంటి రచ్చ సాగుతుందో చూడాలి.