కాళేశ్వ‌రంలో ఏం జ‌రిగిందో వారికి మాత్ర‌మే తెలుసు: ఈట‌ల‌

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌కు తాజాగా బీజేపీ నాయ‌కుడు, అప్ప‌టి బీఆర్ ఎస్ మంత్రి ఈటల రాజేంద‌ర్ హాజర‌య్యారు. సుమారు రెండు గంట‌ల‌కుపైగా విచార‌ణ క‌మిష‌న్ ఆయ‌న‌ను ప్ర‌శ్నించింది. అయితే.. లోప‌ల ఏం జ‌రిగింద‌న్న విష‌యం తెలియ‌దు కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చాక ఈటల మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఏం జ‌రిగిందో `ఆ ఇద్ద‌రికి` మాత్ర‌మే తెలుసున‌ని వ్యాఖ్యానించారు. త‌న త‌ల‌పై తుపాకీ గురిపెట్టినా.. తాను చెప్పేది ఇదేన‌ని తేల్చి చెప్పారు. ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌నే దానిపై స్పందిస్తూ.. ఒక‌రు కేసీఆర్‌, మ‌రొక‌రు హ‌రీష్ రావులేన‌ని పేర్కొన్నారు. కాళేశ్వరం విష‌యంలో త‌న పాత్ర ఏమీ లేద‌న్నారు. ప్రాజెక్టును తొలుత చేసిన డిజైన్ ను కాద‌ని.. రీడిజైన్ చేశార‌ని.. దీనికి గాను అప్ప‌టి సీఎంగా కేసీఆర్ ఓ క‌మిటీని ఏర్పాటు చేశార‌ని తెలిపారు.

దీనికి అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి హ‌రీష్‌రావు చైర్మ‌న్‌గా ఉన్న‌ట్టు ఈట‌ల చెప్పారు. ఇంత‌కుమించి త‌న‌కు తెలియ‌ద‌ని వెల్ల‌డించారు. అయితే.. మేడిగ‌డ్డ అంశం మాత్రం మ‌ధ్య‌లో వ‌చ్చింద‌న్నారు. కాళేశ్వ‌రానికి ఊహించ‌ని విధంగా నీరు వ‌చ్చి చేరుతుంద‌ని అంచ‌నా వేశార‌ని.. దీంతో మేడిగ‌డ్డ వ‌ద్ద బ్యారేజీ క‌ట్టార‌ని ఈట‌ల వివ‌రించారు. “ఇక రాజ‌కీయ నాయ‌కుడిగా నాకు ఇంత‌కుమించి ఏమీ తెలియ‌దు. పైగా ఇది ఇంజ‌నీర్ల‌కు సంబంధించిన విష‌యం. ఆ ఇద్ద‌రే దీనిని చూశారు“ అని ఈట‌ల వివ‌రించారు.

అదేవిధంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌యంపైనా ఈట‌ల వివ‌ర‌ణ ఇచ్చారు. వాస్త‌వానికి తొలినాళ్ల‌లో ప్రాజెక్టు కోసం 62-63 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల‌ని అనుకున్నా.. త‌ర్వాత ప్రాజెక్టు ఖ‌ర్చు పెరిగింద‌ని.. దీంతో మ‌రో 20 వేల కోట్ల‌ను అద‌నంగా వెచ్చించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్ప‌టికీ .. త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌న్నారు. త‌న‌కు తెలిసిన‌వి ఇవేన‌ని.. ఇంత‌కు మించి త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌న త‌ల‌పై తుపాకీ గురి పెట్టినా.. ఇదే చెబుతాన‌న్నారు.