-->

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌.. లోకేష్ కీల‌క ఒప్పందం!

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏప్ర‌భుత్వం చేయ‌ని విధంగా తొలిసారిగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదేస‌మ‌యంలో కీల‌క ఒప్పందం కూడా చేసుకుంది. అదే ఏఐ ఒప్పందం. ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) కంప్యూటింగ్ సంస్థ “ఎన్ విడియా”తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేష్ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ ఒప్పందం ద్వారా.. 10 వేల మంది యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌నున్నారు.

ముఖ్యంగా 500 ఏఐ ఆధారిత స్టార్టప్ ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. ఈ కేంద్రాన్ని రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌నున్నారు.  `ఎన్ విడియా`తో తాజాగా ఈ కీలక ఒప్పందం కుదుర్చుకున్నా రు. దేశంలో ఏఐ ఆధారిత పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా నిల‌పాలని మంత్రి నారా లోకేష్ అభిల‌షిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిని `ఎన్ విడియా` స‌హ‌కారం అందించ‌నుంది.

ఈ ప్రాజెక్టులో ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు.10 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, 500 ఏఐ ఆధారిత స్టార్టప్‌ల అభివృద్ధికి కృషి చేయ‌నున్నారు. అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ లు, హార్డ్‌వేర్ సామర్థ్యాలను అందించ‌నున్నారు. విద్యార్థులకు ప్రాజెక్ట్‌లు, పరిశోధన, మార్కెట్ అవకాశాలు, మెంటార్‌షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించనున్నారు.