తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటు చాలా ఎక్కువ. ఆయన హేతువాది అని ఎక్కడా చెప్పుకోలేదు. అయితే.. గియితే.. కమ్యూనిస్టు భావజాలం కొంత మేరకు ఉన్నా.. అవి ఆయన సెంటిమెంటుకు అడ్డం కూడా కాలేదు. నుదిటిన బొట్టు పెట్టినా.. ఎన్నికల సమయంలో యాగాలు చేసినా.. ఆయన సెంటిమెంటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క ఎన్నికల సమయం అనేకాదు.. అసలు ఆది నుంచి కూడా సెంటిమెంటుకు పెద్ద పీట వేశారు.
ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా.. ఒకటికి రెండు సార్లు పండితులను మార్చి మార్చి ముహూర్తాలు ఫిక్స్ చేయించారన్న చర్చ కూడా గతంలో ఉంది. కాళేశ్వరం భూమి పూజకు కాకినాడ పండితులతోనే కాకుండా .. ఇతర రాష్ట్రాలకు చెందిన పండితులతోనూ ముహూర్తం పెట్టించారు. ఇక, ఏదైనా పథకం ప్రారంభించా లన్నా.. ఆయన ముహూర్త బలానికి పెద్దపీట వేస్తారు. ఇలా.. సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇచ్చే కేసీఆర్ కు.. “బీ” అనే పదం కలిసి రావడం లేదా? అనే చర్చ సాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్రసమితిగా మార్చిన దరిమిలా.. టీఆర్ఎస్ కాస్తా.. బీఆర్ఎస్ అయింది. మరక మంచిదే అన్న యాడ్ ప్రకారం.. మార్పు మంచిదే అనుకుందాం. కానీ.. ఆ తర్వాత.. రాజకీయంగా జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. టీ కాస్తా “బీ”గా మారిన తర్వాత.. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఇది వాస్తవం. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు చేశాక.. కేసీఆర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఆయనను అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది.
ఇక, 2022, అక్టోబరులో(రెండోసారి అధికారంలోకి వచ్చాక) టీఆర్ఎస్‌ను కాస్తా బీఆర్ఎస్ చేశాక.. అనతి కాలంలో జారు బండపై కుస్తీలు పట్టే పరిస్తితి ఏర్పడింది. మొత్తం వివరణ కన్నా.. కొన్ని కీలక పాయింట్లు చూస్తే.. కేసీఆర్ ఎంత వేగంగా గ్రాఫ్‌ను పోగొట్టుకున్నారో.. తెలుస్తుంది. అయితే.. ఇది బీఆర్ఎస్‌గా మార్పు జరిగిన తర్వాతే జరిగిన పరిణామం కాబట్టి.. కేసీఆర్‌కు ‘బీ’ అక్షరం కలిసి రాలేదన్న వాదన ఆయన వర్గంలో వినిపిస్తోంది.
బీఆర్ఎస్‌గా మారాక.. ఇలా.. ఢమాల్!
1) బీఆర్ఎస్ ఏర్పడిన ఏడాది కాలంలోనే అధికారం కోల్పోయారు.
2) బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలు చేయాలని అనుకుని.. ప్రాంతీయ స్థాయికి పరిమితం అయ్యారు.
3) బీఆర్ఎస్ ఏర్పడ్డాకే.. రాజకీయ చిక్కులు మరిన్ని ఎక్కువై.. కుమార్తె కేసులో చిక్కుకుని.. జైలు బాటపట్టారు.
4) బీఆర్ఎస్ గా మార్పు చేశాక.. ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉచ్చులా మారింది.
5) బీఆర్ఎస్‌గా ఏర్పాటు చేసుకున్నాక.. తెలంగాణ సమాజంలో కేసీఆర్ ‘దిగ్గజం’ అనే టాక్ తగ్గుముఖం పట్టింది.
6) సొంత ఇంట్లోనే రాజకీయ కుంపటి ప్రారంభమైంది.
7) చిత్రం ఏంటంటే.. ఏడాది తిరిగే సరికి.. కేసీఆర్ కు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది.
8) పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ ఎస్‌ను ప్రజలు స్వాగతించలేక పోయారు.
9) కన్న కూతురే కంట్లో నలుసుగా మారారు.
కొసమెరుపు… ఇవన్నీ యాదృచ్ఛికాలో.. లేక కోరి చేసుకున్నవో.. ఏదైనా కూడా.. బీఆర్ఎస్ అనే పేరు మార్పు తర్వాత జరిగిన పరిణామాలు కావడంతో కేసీఆర్ అనుచరులు.. సెంటిమెంటుకు ముడిపెడుతున్నారు.