వైఎస్ మారాడు.. జ‌గ‌న్ కూడా మారాలి..: జేసీ ప్ర‌భాక‌ర్

వైసీపీ అధినేత జ‌గ‌న్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంత‌పురం జిల్లాకు చెందిన, టీడీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్న‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్టాడుతూ.. “జ‌గ‌న్ మారాలి. లేక‌పోతే.. క‌ష్ట‌మే. ఇంకా బెదిరింపులు.. సాధింపులు చేస్తానంటే.. ప్ర‌జ‌లు ఒప్పుకోరు. ప్ర‌జ‌లు కూడా ర‌క్ష‌ణ కోరుకుంటున్నారు. బెదిరింపుల‌తో రాజ‌కీయాలు చేయ‌లేరు. ఆ రోజులు పోయాయి. వాళ్ల నాయ‌న కూడా మారాడు. అందుకే ప్ర‌జ‌లు యాక్స‌ప్ట్ చేశారు” అని జేసీ వ్యాఖ్యానించారు.

పోలీసుల‌ను, అధికారుల‌ను బెదిరించ‌డం వ‌ల్ల జ‌గ‌న్ కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని జేసీ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అభివృద్దిని కోరుకుంటున్న ప్ర‌జ‌లు.. జ‌గ‌న్‌ను ఎందుకు ప‌క్కన పెట్టారో తెలుసుకోవ‌డం ఈజీనేని చెప్పారు. అంద‌రికీ ఈ విష‌యంపై క్లారిటీ ఉంద‌ని.. కానీ జ‌గ‌న్‌కే క్లారిటీ లేద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా మార్పు దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేయ‌క‌పోతే.. ఆయ‌న‌తో పాటు పార్టీలో ఉన్న‌వారు కూడా.. భూస్థాపితం అయిపోతార‌ని అన్నారు. “మేమేం చేస్తాం. ప్ర‌జ‌లే చేస్తారు. అంద‌రూ చూస్తున్నారు. ఏడాది అయింది. సింప‌తీలేదు. పైగా బెదిరింపులు. ఎవ‌రు మాత్రం ఇష్ట‌ప‌డ‌తారు?” అని జేసీ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ప్ర‌జ‌ల్లోకి రావ‌డానికి జ‌గ‌న్‌కు ఇంకా స‌మ‌యం ఉంద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఒక టీడీపీ నాయ‌కుడిగా తాను జ‌గ‌న్ గురించి మాట్లాడ‌డం లేద‌న్న జేసీ.. వైఎస్ కుటుంబానికి ముఖ్యంగా విజ‌య‌మ్మ మొహం చూసి జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇస్తున్నాన‌ని చెప్పారు. “పార్టీలో అంద‌రూ మంచోళ్లే. కానీ, …..డే మొండి ఘ‌టం. ఎవ‌రి మాట విన‌డు. చెబితే అర్ధం చేసుకోడు. ఏం చేస్తారు పాపం.” అని జేసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూట‌మి మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని చెప్పారు. ప‌థ‌కాలు, సంక్షేమం ఇవ‌న్నీ కాద‌ని.. అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటున్నార‌ని చెప్పారు. “ఒక ఇంట్లో 20 వేలు సంపాయించుకునే ఉద్యోగం కావాలా.. ఏడాదికి 10 వేలు ఇచ్చే సంక్షేమం కావాలా?” అని జేసీ ప్ర‌శ్నించారు.