మీరేమైనా చేయండి.. జ‌నం మ‌న గురించే మాట్లాడాలి: చంద్ర‌బాబు

“మీరు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లండి. లేదా మ‌రేదైనా చేయండి. కానీ, జ‌నం మాత్రం మ‌న గురించి.. మ‌న ప్ర‌భుత్వం గురించే మాట్లాడు కోవాలి. ప్ర‌భుత్వం అందించే సంక్షేమంపైనే చ‌ర్చ జ‌ర‌గాలి. ఇది మీ బాధ్య‌త‌.” అని టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌ల‌కు, ఎమ్మెల్యే ల‌కు సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే నెల 12తో రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది అవుతోంద‌ని.. ఈ నేప‌థ్యం లో 1వ తేదీ నుంచే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని ఆయ‌న ఆదేశించారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు సంతృప్తితో ఉన్నార‌న్న చంద్ర‌బాబు .. దానిని నిరంత‌రం కాపాడుకునే బాధ్య‌త‌ను నాయ‌కులు తీసుకోవాల‌ని సూచించారు.

ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సులో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే నెల 4న రాష్ట్రంలో నిర్వ‌హించ‌న నిర‌స‌న‌ల‌పై పార్టీ నాయ‌కులు చంద్ర‌బాబుకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. “మీరు కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి. ప్ర‌భుత్వం ఏం చేసిందో వివ‌రించండి. ఏం చేయాలో అది చేయండి. ప్ర‌జ‌లు మ‌న‌వైపే ఉన్నారు. 94 శాతం స్ట్ర‌యిక్ రేట్ సాధించాం. ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి. ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని వారికి వివ‌రించండి. రాజ‌కీయాలు వ‌ద్దు. సంక్షేమంపైనా.. అభివృద్ధిపైనా వివ‌రించండి.” అని దిశానిర్దేశం చేశారు.

గ‌త 11 నెల‌ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారులు నిర్మించామ‌న్న చంద్ర‌బాబు.. ఈ విష‌యాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు బ‌లంగా వివ‌రించాల‌ని సూచించారు. పెట్టుబ‌డులు పెట్టేలా పెద్ద పెద్ద కంపెనీల‌ను ఒప్పిస్తున్నామ‌ని.. సీమ స‌హా అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని అన్నారు. “మ‌నం చేసిన ప‌నులు మ‌నం చెప్పుకోక‌పోతే.. న‌ష్ట‌పోతాం. ఆ ప‌రిస్థితి రానివ్వొద్దు. మీరు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండండి. మీడియాతో మాట్లాడండి. ఏ న‌లుగురు క‌లిసినా.. ప్ర‌భుత్వం గురించే మాట్లాడుకునేలా చేయాలి. ఇది మీరు క్షేత్ర‌స్థాయిలో చేయాల్సిన ప‌ని” అని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

ఇదిలావుంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న మేర‌కు.. వ‌చ్చే 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వ‌హిస్తున్నారు. అదే రోజు.. గ‌త ఏడాది ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఈ ఫ‌లితాల్లో కూట‌మి విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. కూట‌మి స‌ర్కారు రాక‌తో రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. వారికి ఒక్క సంక్షేమ ప‌థ‌కం కూడా చేరువ కావ‌డం లేద‌ని పేర్కొంటున్న జ‌గ‌న్‌.. జూన్ 4ను వెన్నుపోటు దినంగా పాటించాల‌ని పార్టీ నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. తాజాగా దానికి సంబంధించిన వాల్ పోస్ట‌ర్‌ను కూడా ఆవిష్క‌రించారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు వీడియో కాన్ఫ‌రెన్సుకు ప్రాధాన్యం ఏర్ప‌డింది.