వైసీపీ నాయ‌కుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై కేసు

వైసీపీ నాయ‌కుడు, మంగ‌ళ‌గిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్నారెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. వైసీపీ నాయ‌కుల‌పై వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో తాజాగా.. ఆళ్ల‌పైనా పోలీసులు కేసు పెట్టారు. గ‌తంలో 2021-22 మ‌ధ్య కాలంలో మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో ఆళ్ల‌పై కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ పోలీసులు తాజాగా ఆళ్ల పేరును కూడా విచార‌ణలో చేర్చారు.

ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని ఈ కేసులో 127వ నిందితుడిగా(ఏ-127) పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న ఈ రోజో రేపో నోటీసులు ఇచ్చి విచార‌ణ‌కు పిలిచే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. గ‌తంలో వైసీపీ పాల‌న‌లో టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. కార్యాల‌య అద్దాల‌ను ధ్వంసం చేయ‌డంతోపాటు.. ఫ‌ర్నిచ‌ర్‌ను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక విచార‌ణ జ‌రుగుతోంది.

ఇటీవ‌లే ఈ కేసుకు సంబంధించి వైసీపీ నాయ‌కుడు, కీల‌క స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆ పార్టీ మ‌రోనేత దేవినేని అవినాష్ చౌద‌రిల‌ను సీఐడీ పోలీసులు విచారించారు. ఇక‌, ఇప్ప‌టికే 12 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఈ కేసులో చిక్కి రిమాండ్ ఖైదీలుగా ఉండ‌గా.. ప‌లువురిని ఇప్ప‌టికే సీఐడీ పోలీసులు విచారించారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం ఉన్న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈయ‌న ఏం చెబుతారో చూడాలి.