=

‘మ‌హానాడు’.. అస‌లీ పేరు ఎలా వ‌చ్చింది?

‘మ‌హ‌నాడు’.. ఇది టీడీపీకి మాత్ర‌మే సొంత‌మైన పేరు. వాస్త‌వానికి ప్ర‌తి పార్టీ కూడా ప్లీన‌రీ పేరుతో ఆ పార్టీ విధి విధానాల‌ను ఏటా చ‌ర్చిస్తుంది. ద‌శ‌-దిశ‌ల‌ను క‌ల్పిస్తుంది. కానీ, ఇత‌ర పార్టీల‌కు.. టీడీపీకి మ‌ధ్య తేడా ఉంది. ఆయా పార్టీలు ఆవిర్భ‌వించిన రోజును పుర‌స్క‌రించుకుని ప్లీన‌రీని నిర్వ‌హిస్తాయి. అక్క‌డి నుంచి రెండు రోజులు మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు ఉంటాయి.

కానీ, టీడీపీలో అలాకాదు. పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మాజీ సీఎం ఎన్టీఆర్ పుట్టిన రోజు(మే 28)ను పుర‌స్కరించుకుని మ‌హానాడును నిర్వ‌హించ‌డం ప్రారంభ‌మైంది. దీనికి అంకురార్ప‌ణ చేసింది కూడా.. ఎన్టీఆరే కావ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి పార్టీ ఆవిర్భ‌వించింది.. మార్చి 29, 1982వ సంవ‌త్స‌రంలో. ఇలా చూసుకుంటే.. పార్టీ ప్లీన‌రీ కూడా.. త‌దుప‌రి సంవ‌త్స‌రాల నుంచి మార్చి 29నే జ‌ర‌గాలి. కానీ, అలా కాకుండా అన్నగారి పుట్టిన రోజున నిర్వ‌హిస్తారు.

అస‌లీ పేరు ఎలా వ‌చ్చింది?

మ‌హానాడు.. అనేది చాలా చిత్ర‌మైన ప‌దం!. ఈ పేరు ఎలా వ‌చ్చింద‌నే విష‌యం చాలా మందికి ఆస‌క్తి. మ‌హా.. అంటే చాలా గొప్ప‌ది అని అర్థం. నాడు.. అనే ప‌దానికి రోజు, ప‌ర్వ‌దినం అనే స‌మానార్ధ‌కాలు ఉన్నాయి. ఇలా చూసుకున్న‌ట్టు మ‌హానాడు అంటే.. చాలా గొప్ప రోజు అనే అర్థం ఉంది. దీనినే అన్న‌గారు ఖ‌రారు చేశారు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీకగా… తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ఢిల్లీ వ‌ర‌కు వినిపించిన ఆయ‌న‌.. త‌న పుట్టిన రోజు నాడే.. పార్టీకి నిజ‌మైన పండుగగా భావించారు. అందుకే మ‌హానాడు(దీనిని ఓ ప‌త్రిక య‌జ‌మాని సూచించార‌ని అంటారు.)ను నిర్వ‌హిస్తున్నారు.

తొలిసారి ఇక్క‌డే..!

తొలిసారి మ‌హానాడును విజ‌య‌వాడ‌లోని కృష్ణాన‌ది తీరంలో(తాడేప‌ల్లి వైపు) 1983, మే 28, 29 తేదీల్లో రెండు రోజులు మాత్ర‌మే నిర్వ‌హించారు. అందుకే.. ఈ ప్రాంతానికి ఇప్ప‌టికీ.. మ‌హానాడు అనే పేరుతోనే పిలుస్తారు. ఇక్క‌డివారికే ఇటీవ‌ల మంత్రి నారా లోకేష్ ఇంటి ప‌ట్టాలు అందించారు. ఇలా మొద‌లైన సంరంభం.. త‌ర్వాత త‌ర్వాత‌.. పార్టీ నాయ‌కుల అభ్య‌ర్థ‌ల‌న మేర‌కు మూడు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు.

అయితే.. దీనిని కూడా.. మే28కి ముందు, త‌ర్వాత‌.. నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మ‌హానాడును ఏటా నిర్వ‌హిస్తున్నా.. కొన్ని కార‌ణాల‌తో .. ప‌లు సార్లు వాయిదా వేశారు. 1985లో నాదెండ్ల భాస్క‌ర‌రావు సృష్టించిన వివాదం కార‌ణంగా, 1991లో ఒక‌సారి, 1996లో మ‌రోసారి వాయిదా వేశారు. ఇక‌, 2012లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలోనూ వాయిదా వేయ‌డం గ‌మ‌నార్హం.