వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఆదివారం సాయంత్రం కాకాణిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎక్కడ అరెస్టు చేశారనే విషయంపై పోలీసులు రెండు రకాలుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. తొలుత ఆయనను కేరళలో పట్టుకున్నామన్నారు.
కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఆయన వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంటే అదుపులోకి తీసుకున్నామని మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా దీనినే ప్రచారం చేసింది. అయితే.. ఆ తర్వాత.. కాకాణిని బెంగళూరు సమీపంలోని ఓ గ్రామంలో అరెస్టు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే.. కోర్టుకు సమర్పించిన పత్రాలలో మాత్రం బెంగళూరుకు సమీపంలోని ఓ విలేజ్ రిసార్ట్‌లో అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.
ఈరోజు తెల్లవారు జామునే నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు.. ఆయనను స్థానిక జిల్లా పోలీసు ట్రైనింగ్ కేంద్రంలో ఉంచారు. అనంతరం.. భారీ భద్రత నడుమ వెంకటగిరి కోర్టుకు హాజరు పరిచారు. గతంలో ఈ కోర్టులోనే దొంగతనం జరగడం.. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్సెస్ కాకాణికి మధ్య ఉన్న పరువు నష్టం కేసులో పత్రాలు చోరీ కావడం తెలిసిందే. పోలీసులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన జడ్జి కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించారు.
కాకాణిపై కేసులు ఇవీ..
1) గనుల అక్రమ తవ్వకాలు
2) 2 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్(సున్నపురాయి) అక్రమ రవాణా
3) భారీ సౌండ్ వచ్చే పేలుడు పదార్థాల వినియోగం.
4) గనుల తవ్వకాలు అడ్డుకున్న ఎస్టీలపై దౌర్జన్యం.
5) ఎస్టీల ఇళ్లు కూల్చి వేత, దూషణలు.(ఇది ఎస్సీ ఎస్టీ కేసు)
6) పోలీసుల విచారణను తప్పుదారి పట్టించడం.
7) విధుల్లో ఉన్న పోలీసులను ఇబ్బందులకు గురి చేయడం.