దాదాపుగా 3 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. అరెస్టు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిన కాకాణి పప్పులు మాత్రం ఉడకలేదనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలను దాటేసి… మధ్యలో మరో రాష్ట్రాన్ని దాటేసిన కాకాణి… ఏకంగా కేరళలో దాక్కున్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న పోలీసుల నుంచి ఎంత దూరమో పారపోవడం సాధ్యం కాదు కదా. అందుకే కొంతకాలం కాకాణి తప్పించుకుని తిరిగినా చివరకు కేరళలో ఆయన పోలీసులకు పట్టుబడిపోయారు.
వైసీపీ అధికారంలో ఉండగా… సర్వేపల్లి నియోజకవర్గ పరిధి పొదలకూరు మండలంలో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వడమే కాకుండా దానిని నిబంధనలకు విరుద్ధంగా తరలించి వందల కోట్ల రూపాయలను కాకాణి అండ్ కో ఆక్రమంగా ఆర్జించింది. దీనిపై గనుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరిలోనే కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాకాణికి పొదలకూరు పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఇటు నెల్లూరు, అటు హైదరాబాద్ లోనూ అందుబాటులో ఉంటూనే ఆయన నోటీసులను మాత్రం అందుకోకుండా పోలీసులతో దొంగా పోలీస్ ఆట ఆడారు.
అదే సమయంలో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, దానిని కొట్టివేయాలంటూ కాకాణి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుల్లోనూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు చోట్ల ఆ పిటిషన్లు కొట్టివేతకు గురి అయ్యాయి. ఆ తర్వాత కనీసం ముందస్తు బెయిల్ అయినా ఇవ్వాలంటూ ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను కూడా కోర్టులు కొట్టేశాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని కాకాణి.. ఎలాగూ తాను పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నాను కదా అన్న భావనతో… మరింత కాలం దోబూచులాట ఆడదామని అనుకున్నారు.
అయితే ఓ మంత్రిగా, పలు మార్లు ఎమ్మెల్యేగా, సుదీర్ఘ కాలం పాటు సీనియర్ రాజకీయవేత్తగా కొనసాగుతున్న కాకాణి ఎత్తులను చూసిన పోలీసులకు చిర్రెత్తింది. ఇలాగైతే కాదనుకున్న నెల్లూరు పోలీసులు… కాకాణిని అరెస్టు చేసేందుకు పక్కా ప్లాన్ రచించారు. కాకాణి వేర్ అబౌట్స్, గూగుల్స్ మ్యాప్స్, కాకాణి ఫోన్ లొకేషన్లను పరిశీలించిన పోలీసులకు.. కాకాణి జాడ కేరళలో ఉన్నట్లుగా తేలింది. వెంటనే రంగంలోకి దిగిన నెల్లూరు పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కేరళ చేరుకుని ఆదివారం రాత్రి మంచి ఎంజాయ్ మూడ్ లో ఉన్న కాకాణికి బేడీలతో స్వాగతం పలికారు. కాకాణిని అరెస్టు చేసిన పోలీసులు ఈ రాత్రికే కేరళ నుంచి బయలుదేరి సోమవారానికి నెల్లూరు చేరే అవకాశాలున్నాయి.