తెలుగు సినీ పరిశ్రమపై ఏపీ డిప్యూటీ సీఎం, అగ్రహీరో పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఆయన ఉన్నదేదో మొహానే చెప్పేశారు. ఇండస్ట్రీ పెద్దలకు సూటిగా.. సుత్తిలేకుండా.. తన మనసులో మాటను చెప్పేశారు. ఎక్కడా డొంక తిరుగుడు లేదు. ఎక్కడా నాన్చుడు ధోరణిని కూడా అవలంభించలేదు. మరి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తారు? ఏం చేయాలి? అనేది వారి కోర్టులోకే చేరింది. తాజాగా ఆగ్రహం వెనుక.. ప్రభుత్వాన్ని పెద్దలు కలుసుకోవడం లేదన్న ఆవేదన కనిపించింది. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాల్లో ఇండస్ట్రీ పాత్ర లేకపోవడం కూడా.. పవన్ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు వస్తున్న ఆదాయాన్ని గమనిస్తే..ఏపీ నుంచి మెజారిటీ షేర్ ఉంది. తెలంగాణలో లేదని కాదు.. కానీ, తెలంగాణలో వస్తున్న టికెట్ల కలెక్షన్ కంటే.. విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, గుంటూరు, అనంతపురం వంటి నగరాల నుంచి ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. మెజారిటీ సినిమాలు కూడా.. ఏపీపైనే ఆధారపడుతున్నా యి. ఈ క్రమంలో ఏపీలోని ప్రభుత్వానికి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం లేదన్న విషయం కొన్నాళ్లుగా చర్చగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వం పీ-4 విధానాన్ని అమలు చేస్తోంది. ఉన్నతస్థాయి వర్గాలు.. సమాజంలోని పేదలకు సాయం చేయాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం.
దీనికి ఇండస్ట్రీలోని పెద్దలు కూడా కలిసి వస్తారని పవన్ సహా సీఎం చంద్రబాబు కూడా ఆశించారు. కానీ.. రాలేదు. చేయూత కూడా ఇవ్వలేదు. ఈ పరిణామాలపై కొన్నాళ్ల కిందట చంద్రబాబు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. “మాటలు కాదు.. చేతల్లో చూపండి” అంటూ.. పరోక్షంగా ఉన్నతస్థాయి వర్గాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. బహుశ .. ఆ తరహా ఆవేదన ఇప్పుడు పవన్ వ్యాఖ్యల్లో కనిపించింది. అంతేకాదు.. గత ప్రభుత్వంలో ఎంతో అణిచి వేతకు గురి చేసినా.. సినీ పెద్దలు అప్పటి వైసీపీ నాయకులను ఫాలో అవుతున్నారన్న చర్చ కూడా తాజాగా వెలుగు లోకి వచ్చింది.
జూన్ 1 నుంచి సినిమా హాళ్లను బంద్ చేస్తున్నామని ప్రకటించిన(తాజాగా చేయడం లేదని ఫిలిం నగర్ ప్రకటించింది) దరిమిలా.. అసలు ఈ ప్రకటన వెనుక ఉన్నదెవరన్న విషయంపై చర్చ వచ్చింది. అంతేకాదు.. ముఖ్యంగా పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమైన తరుణంలో ఇలా సినిమా హాళ్లను బంద్ చేయడం అనే ప్రకటన మరింత సంచలనంగా మారింది. దీనివెనుక ఎవరున్నారో నిగ్గు తేలుస్తామని.. జనసేన నాయకుడు, మంత్రి దుర్గేష్ కూడా ప్రకటించారు. దీంతో హడావుడిగా సినీ పెద్దలు భేటీ అయినా.. సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తామని.. బంద్ కు దూరంగా ఉంటామని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలే.. పవన్ ఆగ్రహానికి కారణమై ఉంటాయన్నది స్పస్టంగా తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు బంతి పెద్దల కోర్టులోకి వెళ్లింది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.