ఏపీలో వైసీపీ పాలనలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి తొలి అడుగు పడింది ఓ కన్నడిగుడి దబాయింపుతో. వినడానికి వింతగా ఉన్నా… ఏపీతో ఏమాత్రం సంబంధం లేని సదరు కన్నడిగుడు ఏపీలో ఏం జరుగుతుందో?… ఏం జరగాలి?… ఎలా జరగాలో? కూడా నిర్దేశించాడు. అది కూడా తనదైన శైలి రుబాబు, దబాయింపుతో అతడు స్వైర విహారం చేశాడు. అతడే జగన్ కుటుంబ వ్యాపారాల్లో కీలకమైన భారతి సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ బాలాజి గోవిందప్ప.
వృత్తి రీత్యా ఆడిటర్ అయిన గోవిందప్ప… జగన్ వ్యాపారాలకు ఆడిటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో జగన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా నమ్మస్తుడిగానూ మారిపోయారు. ఫలితంగా జగన్ వ్యాపారాల్లో అత్యంత కీలకమైన భారతి సిమెంట్స్ లో చిల్లిగవ్వ పెట్టుబడి పెట్టకుండానే ఆయన ఏకంగా శాశ్వత డైరెక్టర్ పోస్టును కొట్టేశారు. ఆ తర్వాత జగన్ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో గోవిందప్ప తనదైన శైలిలో చక్రం తిప్పారు.
జగన్ ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేకుండానే గోవిందప్ప చక్రం తిప్పిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డితో నిత్యం టచ్ లో ఉండే గోవిందప్ప…కసిరెడ్డి ఆపీస్ కు ఖాళీగా వెళ్లి…తిరిగి వెళ్లేటప్పుడు డబ్బుల కట్టలను తన కారులో కుక్కుకుని వెళ్లేవారట. అలా తీసుకెళ్లిన డబ్బుల కట్టలను ఆయన చేరవేయాల్సిన చోటుకు క్షేమంగా చేర్చేవారట. మధ్యలో కొన్ని కట్టలను తీసుకున్న గోవిందప్ప తన సొంత రాష్ట్రం కర్ణాటకలో రియల్ ఎష్టేట్ వ్యాపారంతో పాటుగా ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి ఎంజాయ్ చేశారట.
ఇక మద్యం కుంభకోణానికి తొలి అడుగు అన్నట్టుగా భావిస్తున్న డిస్టిల్లరీస్ కు బెదిరింపుల వ్యవహారాన్ని గోవిందప్పే మొదలుపెట్టినట్టు సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఏపీలో మద్యం వ్యాపారం చేయాలంటే… ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని ఆయన డిస్టిల్లరీస్ ను బెదిరించారట. అంతేకాకుండా ఆ ముడుపులు కూడా ఎంత అన్న దానిని కూడా గోవిందప్పే నిర్దేశించారట. ఇక ఈ ముడుపులను వసూలు చేసేందుకు అవసరమైన వ్యవస్థనూ ఈయనే రూపకల్పన చేశారట. ఆ తర్వాత ఆ ముడుపులను గుట్టుచప్పుడు కాకుండా అంతిమ లక్ష్యానికి చేర్చారట. ఇందుకోసం షెల్ కంపెనీలను కూడా ఆయన ఏర్పాటు చేశారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates