వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇక, జైలుపక్షేనా? ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదా? అంటే.. ఔననే అంటున్నారు న్యాయవాదులు. ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. దీనికి కారణం.. వంశీకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉండమే నని చెబుతున్నారు.
వంశీ ప్రాతినిధ్యం వహించిన గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఇది జరిగి మూడేళ్లు దాటింది. ఈ క్రమంలో సత్యవర్థన్ అనే యువకుడు.. టీడీపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వంశీ 72 వ నిందితుడిగా ఉన్నారు. కానీ, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. సత్యవర్థన్‌ను బెదిరించి.. భయపెట్టి., కిడ్నాప్ చేసి.. కేసును వెనక్కి తీసుకునేలా చేశారు.
ఈ కేసు ఇప్పుడు వంశీ మెడకు చుట్టుకుంది. దీనిపైనే ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే.. తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇప్పటికి రెండు సార్లు పిటిషన్లు వేసినా రెండు సార్లూ.. హైకోర్టు కొట్టేసింది. పైగా బలమైన ఆధారాలు ఉన్నాయని.. సత్యవర్థన్‌ను మరింత భయపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి వంశీకి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ నెల 13 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింస్తూ.. విజయవాడ సీఐడీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అనుచరులకు కూడా రిమాండ్ ను ఈ నెల 13వ తేదీ వరకు పెంచింది. దీంతో సుప్రీంకోర్టులో విచారణ ముగిసి.. (ఇంకా పిటిషన్ వేయలేదు) తీర్పు వచ్చే వరకు.. వంశీకి జైలు జీవితం తప్పదని ఆయన న్యాయవాదులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates