తమ్ముడిపైనే బాబుకు పిర్యాదు చేసిన కేశినేని నాని

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని మంగళవారం ఓ కీలక అడుగు వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనను ఓడించిన తన సోదరుడు, విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిపై ఏకంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం పొద్దున్నే సోషల్ మీడియాలో నాని ఓ సుదీర్ఘ ట్వీట్ ను పోస్ట్ చేశారు. అందులో చిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి, మంత్రి నారా లోకేశ్ పేరును వాడుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా నాని ఆరోపించారు. అంతేకాకుండా తీవ్ర విమర్శలు వినిపిస్తున్న ఉర్సా క్లస్టర్స్ కంపెనీ చిన్ని బినామీలకు చెందిన కంపెనేనని చెప్పిన నాని.. ఆ సంస్థకు విశాఖలో కేటాయించిన భూములను తక్షణమే రద్దు చేయాలని కోరారు. 

ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఇటీవలే విశాఖపట్నంలోని ఐటీ సెజ్ లో 3.5 ఎకరాలు, నగర పరిధిలోని కాపులుప్పాడ లో 56.36 ఎకరాల భూములను కూటమి సర్కారు నామమాత్ర ధరకే కేటాయించింది. టీసీఎస్ మాదిరే ఉర్సాకు కూడా నామమాత్ర ధరకు భూములు కేటాయించగా… టీసీఎస్ ను పోల్చుతూ ఉర్సాకు కేటాయించిన భూ కేటాయింపులపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వీటినే నాని తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఉర్సా కంపెనీని చిన్ని బినామీలకు చెందిన కంపెనీగానే అభివర్ణించిన నాని… ఉర్సా కంపెనీ డైరెక్టర్ అబ్బూరి సతీశ్ పేరును ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో సతీశ్ తో కలిసి చిన్ని21 సెంచరీ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ పేరిట ఓ కంపెనీని స్థాపించి… దాని ద్వారా పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును సేకరించి, నకిలీ ఆస్తులను విక్రయించి వందల కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. 

మొత్తంగా తన సోదరుడు చిన్ని అక్రమార్కుడని తేల్చి చెప్పిన నాని… చిన్నిని ప్రోత్సహించరాదని కూడా చంద్రబాబును కోరారు. ఎంపీ పదవితో పాటుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ హోదాలోనూ చిన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా, మట్టి తవ్వకాలు, ఫ్లై యాష్ అక్రమ రవాణా, పేకాట క్లబ్బుల

నిర్వహణ, రియల్ ఎస్టేట్ మాఫియాను చిన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం లోకేశ్ పేరును చిన్ని వినియోగించుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. లోకేశ్ పేరు చెప్పుకుని అక్రమ దందా సాగిస్తున్న చిన్నిని ఎలా ఉపేక్షిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. చిన్ని లాంటి నేతల తీరు కారణంగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి కూడా చెడుగా మారిపోతోందని, పార్టీకి తీరని నష్టం జరుగుతోందని కూడా నాని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్ని అక్రమాలకు అడ్డు కట్ట వేయాలని కూడా ఆయన చంద్రబాబును కోరారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్ తో సాగుతున్నారని ఆయన చంద్రబాబును కీర్తించారు. టీసీఎస్ కు విశాఖలో భూ కేటాయింపులే ఇందుకు ప్రబల నిదర్శనమని కూడా నాని పేర్కొన్నారు. విశాల దృక్పథంతో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంలో ఎంతో ఉపయోగ పడుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను తీసుకురానుందని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా టెక్నాలజీ రంగంలో రాష్ట్రానికి ప్రపంచలోనే ప్రత్యేక గుర్తింపు రానుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఓ స్పష్టమైన విజన్ తో సాగుతున్న చంద్రబాబు చర్యలు చిన్ని లాంటి నేతల చర్యలతో నిర్వీర్యమవుతాయన్న ఆందోళన తనకు ఉందని ఆయన అన్నారు. తన లేఖను చూసి చిన్నిని నిలువరించడంతో పాటుగా ఉర్సా క్లస్టర్స్ కు కేటాయించిన భూములను రద్దు చేస్తారని ఆశిస్తున్నట్లు నాని అందులో ఆశాభావం వ్యక్తం చేశారు.