వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇటీవలే ప్రత్యర్థుల దాడిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ పాపిరెడ్డిపల్లి సమీపంలోని మద్దికుంట వద్ద ల్యాండైన జగన్… అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా పాపిరెడ్డిపల్లి చేరుకున్నారు. లింగమయ్య కుటుంబ పరామర్శను పూర్తి చేసుకున్న ఆయన రోర్డు మార్గం మీదుగానే బెంగళూరు వెళ్లిపోయారు. వాస్తవానికి వచ్చిన హెలికాప్టర్ ద్వారానే జగన్ తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఇందుకు వైసీపీ శ్రేణుల అత్యుత్సాహమే కారణమని చెప్పాలి.
జగన్ కు క్రౌడ్ పుల్లర్ గా పేరుంది. జగన్ ఎక్కడికి వెళ్లినా… జనం ఆయనను చూసేందుకు ఎగబడతారు. ఇక టీడీపీకి కంచుకోటగా ఉండటమే కాకుండా మాజీ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడుకు జగన్ వస్తున్నారంటే… తమ బలాన్ని నిరూపించుకునేందుకు వైసీపీ కీలక నేతలు భారీ ఎత్తున జనాన్ని సమీకరించారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తుంటే… అదేదో విజయోత్సవ సభ అయినట్లుగా కదలి రండి అంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పిలుపు ఇచ్చారు. దీంతో రాప్తాడు నుంచే కాకుండా పొరుగు నియోజకవర్గాల నుంచి కూడా జనం భారీ సంఖ్యలోనే పాపిరెడ్డిపల్లికి వచ్చారు. భద్రతా కారణాల రీత్యా జనాన్ని పోలీసులు అదుపు చేసేందుకు యత్నిస్తే… జగన్ ను ఇలా అడ్డుకుంటారేమిటంటూ వైసీపీ నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.
జగన్ హెలికాప్టర్ దిగేందుకు మద్దికుంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ అలా హెలికాప్టర్ దిగారో, లేదో.. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఎగబడిపోయాయి. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఎలాగోలా పోలీసులు జగన్ ను అక్కడి నుంచి కారు ఎక్కించి పాపిరెడ్డిపల్లి పంపించగా… హెలికాప్టర్ పైకి ఎక్కిన వైసీపీ శ్రేణులు దానిని ఎక్కి, తొక్కి నానా రచ్చ చేశారు. పోలీసులు నిలువరించే యత్నం చేసినా ఒకేసారి వందల మంది దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది ఫలితంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయింది. దీనిని గమనించిన పైలట్.. విండ్ షీల్డ్ పగిలిన కారణంగా హెలికాప్టర్ లో తిరుగు ప్రయాణం సాధ్యం కాదని జగన్ కు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక జగన్ రోడ్డు మార్గం మీదుగానే బెంగళూరు వెళ్లిపోయారు. అయితే అదేదో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిందంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడం గమనార్హం.