బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ చేతికి.. రక్తపు మరకలు అంటాయని ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కంచ గచ్చబౌలిలోని హైద రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై స్పందించారు. ఇక్కడి 400 ఎకరాల భూములను రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు కదం తొక్కారు. నిరసనలు, ధర్నాలకు దిగారు. మరోవైపు.. కోర్టులు కూడా.. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించాయి. దీంతో అక్కడ పనులు నిలిచిపోయాయి.
అయితే.. గత నాలుగు రోజుల్లో వంద ఎకరాల్లో చెట్లను నరికి వేశారని.. ప్రభుత్వం సామాజిక ఉద్యమకారులు, విశ్లేషకులు మండి పడుతున్నారు. ఇక, తాజాగా శుక్రవారం మధ్యాహ్నం.. ఓ జింకను యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఓ కుక్క.. దాడి చేసి చంపేసింది. దీనిని ప్రస్తావించిన మాజీ మంత్రి కేటీఆర్.. అడవులను నరికి వేయడం వల్లే.. జింక బయటకు వచ్చిందని.. ప్రాణాలు కోల్పో యిందని వ్యాఖ్యానించారు. జింక రక్తపు మరకలు.. రాహుల్ గాంధీ చేతికి అంటుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి బుద్ధి మాంద్యం పెరిగిపోయిందని.. అందుకే పచ్చని చెట్లను నరికేస్తున్నారని విమర్శించారు.
తమ హయాంలో పచ్చదనం పెంచేందుకు కృషి చేశామని కేటీఆర్ వివరించారు. అయితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి పచ్చదనం పెంచకపోగా.. ఉన్న దానిని కూడా ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 100 ఎకరాల్లో పచ్చదనాన్ని ఇష్టానుసారం ధ్వంసం చేశారని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని ఆయన విన్నవించారు. “రాజకీయంగా కొట్లాడుతం. పర్యావరణ పరంగా కూడా కొట్లాడుతాం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కుదిరితే.. తాము కూడా సుప్రీంకోర్టు వెళ్తామని.. బుద్ధి మాంద్య ప్రభుత్వాన్ని అన్ని రూపాల్లోనూ ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు.